నేటి నుంచి రెండో విడత సదరం సర్టిఫికెట్ల తనిఖీ
మహారాణిపేట : కూటమి ప్రభుత్వం దివ్యాంగులపై కక్ష గట్టింది. ఎన్నికలకు ముందు దివ్యాంగులకు ఇచ్చే పింఛన్ పెంచుతామని ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించే కుట్రకు తెరతీసింది. పింఛన్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై పడుతున్న భారాన్ని తగ్గించుకోడానికి తెలివిగా లబ్ధిదారుల్లో కోత విధించాలని చూస్తోంది. ఇందులో భాగంగా దివ్యాంగులకు మరోసారి పరీక్షలు చేస్తోంది. ఇప్పటికే సామాజిక పింఛన్లు తీసుకొనే వారి మీద ర్యాండమ్‌గా సర్వే చేసిన సంగతి విధితమే. మంచంపై లేవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు నెలకు రూ.15 వేలు పింఛను తీసుకుంటున్నవారి సర్వే గురువారంతో పూర్తయింది. మిగిలిన దివ్యాంగులపై సర్వే ప్రారంభించనున్నారు. శుక్రవారం నుంచి ఆయా పింఛనుదారులకు నోటీసులు జారీ చేయనున్నారు. అనంతరం వారిని సంబంధిత ఆస్పత్రులకు రప్పించనున్నారు. అలాగే వైద్యుల బృందం దివ్యాంగులకు మళ్లీ పరీక్షలు చేయనున్నారు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
మొదటి విడత సర్వే పూర్తి
దీర్ఘకాలిక వ్యాధులతో మంచం పట్టి ఎన్టీఆర్ భరోసా పింఛను పొందుతున్న వారి ధ్రువీకరణ పత్రాల (సదరం) పరిశీలన గురువారంతో పూర్తయింది. మొత్తం 319 మంది ఇళ్లకు వెళ్లి వైద్యులు, అధికారులు విచారణ చేపట్టారు.
రెండో విడత ఏరివేతకు శ్రీకారం
వివిధ కేటగిరీలో పింఛను పొందుతున్న దివ్యాంగుల ఏరివేతకు శుక్రవారం నుంచి శ్రీకారం చుడుతున్నారు. వివిధ కేటగిరీల దివ్యాంగులు రూ.6 వేలు పింఛను పొందుతున్నారు. ఇటువంటివాళ్లు జిల్లాలో మొత్తం 21,306 మంది ఉన్నారు. దివ్యాంగులు (అర్ధోపెడిక్)లో 12,238 మంది, కంటి దివ్యాంగులు 2,373 మంది, ఈఎన్‌టీ దివ్యాంగులు 2,287 మంది, మానసిక దివ్యాంగులు 4,408 మంది ఉన్నారు. వీరికి డీఆర్‌డీఏ జారీ చేసిన నోటీసులను సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు అందజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment