నెలకు రూ.3 కోట్లు వసూలు!
చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో చేపడుతున్న అధికార, అనధికార మైనింగ్ ద్వారా ప్రతీ రోజూ పదుల సంఖ్యలో లారీల నుంచి కంకర తరలివెళుతోంది. ఇక స్థానిక అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా కూడా తరలిస్తున్నారు. గుర్తింపు ఉన్న క్వారీల నుంచి తరలిస్తున్న వాటికి సీనరేజీ కింద ప్రభుత్వం వసూలు చేసే మొత్తానికి అదనంగా టన్నుకు రూ. 250 వసూలు చేస్తున్నారు. పక్క నియోజకవర్గానికి చెందిన కూటమి నేత పేరుతో ‘ఏపీ’ ట్యాక్స్‌గా అధికారికంగా ఈ మొత్తాన్ని వసూలు చేస్తుండటం గమనార్హం. అంటే ఇక్కడ ప్రతీ రోజూ రూ.10 లక్షలు.. నెలకు రూ.3 కోట్ల మేర వసూలు చేస్తున్నారు. నిబంధనల మేరకు ఒక్కో లారీ నుంచి 20 టన్నుల కంకరను తరలించాల్సి ఉండగా.. 30 టన్నుల వరకు తరలించేస్తున్నారు. తద్వారా ఒక్కో టన్నుకు అదనంగా రూ. 250 చెల్లించి.. అధిక లోడును తీసుకెళ్లేందుకు టిప్పరు యాజమాన్యాలకు కూటమి నేతలు అనుమతిస్తున్నారు. ఇక్కడి నుంచి తరలించే ఏ వాహనాన్ని కూడా అటు మైనింగ్ అధికారులు కానీ.. ఇటు రవాణాశాఖ అధికారులు కానీ ఆపేందుకు సాహసించడం లేదు. అధిక లోడుకు అనధికారికంగా అనుమతి లభిస్తుండటంతో సదరు టిప్పరు యజమానులు కూడా రూ.250 మొత్తాన్ని చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ట్రాక్టర్ యజమానులు కూడా టన్నుకు రూ.250 చొప్పున చెల్లించి అదనపు లోడును తీసుకెళుతున్నారు. అయితే సదరు టిప్పరు, ట్రాక్టర్ యజమానులు.. ఇంటి నిర్మాణదారులు, ఎన్‌ఆర్‌ఈజీఎస్, రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లపై భారం మోపుతున్నారు. తద్వారా ఇంటి నిర్మాణ వ్యయం పెరుగుతోందని నిర్మాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు, సీసీ రోడ్లు, బీటీ రోడ్లతో పాటు డ్రైనేజీ నిర్మాణంలో అదనపు భారాన్ని మోయాల్సి వస్తోందని కాంట్రాక్టర్లు కూడా గగ్గోలు పెడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment