లోకేష్ పుట్టినరోజు వేడుకల్లో జోనల్ కమిషనర్
గోపాలపట్నం : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు సందర్భంగా గోపాలపట్నం ప్రధాన రహదారిలో సుకన్య సినిమా హాల్ ప్రాంగణంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో జోన్–8 కమిషనర్ హేమావతి పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఇది పార్టీ కార్యక్రమమైనా జోనల్ కమిషనర్ హాజరు కావడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాధికారి పార్టీ కార్యక్రమాలకు హాజరుకాకూడదనే నియమం ఉన్నా ఆమె పట్టించుకోకపోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే గణబాబు హాజరై కేక్ కట్ చేశారు. కబడ్డీ పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిరుద్యోగ మహిళలకు శిక్షణ
ఆరిలోవ : నిరుద్యోగ మహిళా యువతకు పైనాపిల్‌కాలనీ వద్ద జిల్లా మహిళా ప్రాంగణంలో వచ్చే నెల ఒకటో తేదీ నుంచి చేతి వృత్తుల్లో రెండు నెలల శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రాంగణం జిల్లా మేనేజర్ పి.విమల గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. నర్సింగ్, రిటైల్‌లో శిక్షణ ఇస్తామన్నారు. నర్సింగ్ శిక్షణకు పదో తరగతి, రిటైల్ శిక్షణకు 8వ తరగతి చదువుకున్న మహిళలు అర్హులని తెలిపారు. 18–36 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ నెల 31తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. శిక్షణ అనంతరం ప్లేస్‌మెంట్ కల్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో రూ.1,000 స్టైఫండ్ ఇస్తామని, మరిన్ని వివరాలు కోసం 6281261415 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment