వినతులను స్వీకరిస్తున్న కలెక్టర్ నిషాంత్‌కుమార్
పార్వతీపురం: స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలపై తక్షణమే స్పందించి గడువులోగా పరిష్కారం చూపాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ కోరారు. ఈ మేరకు స్పందన కార్యక్రమాన్ని సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశమందిరంలో ఆయన నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ నిషాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఒ.ఆనంద్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సి.విష్ణు చరణ్‌లు పాల్గొని ప్రజల నుంచి 86 అర్జీలను స్వీకరించారు. స్పందన కార్యక్రమంలో సామాజిక, వ్యక్తిగత సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలపై చర్యలు గురించి సంబంధిత అధికారులతో నేరుగా, ఫోన్ ద్వారా మాట్లాడి తగిన విచారణ జరిపి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వెద్య ఆరోగ్య అధికారి బి.జగన్నాథ రావు, డీఆర్‌ఖడీఏ ప్రాజెక్టు డైరెక్టర్ పి. కిరణ్ కుమార్, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డాక్టర్ ఎంవీజీ కృష్ణాజీ, జిల్లా ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకర రావు, గ్రామ, వార్డు సచివాలయాల సమన్వయ అధికారి వి.చిట్టి బాబు, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కేవీఎల్‌ఎన్ మూర్తి, జిల్లా గ్రామ పంచాయతీ అధికారి బలివాడ సత్యనారాయణ, జిల్లా పశు సంవర్థక అధికారి ఎ.ఈశ్వర రావు, జిల్లా విద్యా శాఖ అధికారి డా.ఎసీడీవీ రమణ, జిల్లా నైపుణ్యాభిభివృద్ధి అధికారి, ఉరిటి సాయికుమార్, జిల్లా ప్రణాళిక అధికారి పి.వీర రాజు తదితరులు పాల్గొన్నారు.
అర్జీలలో కొన్ని ఇలా ఉన్నాయి.
కుమారులు పోషించడం లేదు
నాకు, నా భార్యకు 70 సంవత్సరాలు పైబడ్డాయి. మా కుమారులు పోషించడం లేదు. మునిసిపాలిటీలోని కూరగాయల మార్కెట్‌లో కేటాయించిన షాపు నంబర్–17ను పెద్ద కుమారుడు రెడ్డి రఘునాథరావు, రెండవ కుమారుడు రెడ్డి మాధవరావులు ఆక్రమించి మాకు జీవనోపాధిలేకుండా చేశారు. వయోవృద్ధుల పరిరక్షణ చట్టం ప్రకారం తన కుమారులిద్దరిపై చర్యలు తీసుకొని, తన పేరున గల షాపు తనకు ఇప్పించి ఆదుకోవాలని పాలకొండ పట్టణంలోని మొగలివీధికి చెందిన రెడ్డి గంగారావు అర్జీ అందజేశారు.
దూషిస్తున్నారు
సాలూరు పట్టణంలోని బంగారమ్మకాలనీలో ఇల్లు కొనుక్కుని గోడ కట్టిస్తుండగా పక్క ఇంటిలోగల ఎస్.కె.కృష్ణ కుమారులు శ్రీను, రోషన్ తనపై దౌర్జన్యానికి పాల్పడి, అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కు సాలూరుకు చెందిన రొంగలి ప్రమీల కోరారు.
ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బు వసూలు
సీతానగరం మండలం చెల్లంనాయుడువలస గ్రామానికి చెందిన కొట్టాన ఉమమహేశ్వరరావు తన మనుమడు నీలకంఠానికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని రూ.1,50,000/– తీసుకుని మోసం చేశాడు. మోసగాడిపై చర్యలు తీసుకుని తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పార్వతీపురం మండలం, డోకిశిల పంచాయతీ, తేలునాముడువలసకు చెందిన డి.సన్యాసి దొర ఆర్జీ అందజేశాడు.
బాలికా సంరక్షణ బాండు కావాలి
తనకు ఇద్దరు ఆడపిల్లలని, వారికి బాలికా సంరక్షణ పథకం బాండు మంజూరు చేయవలసిందిగా పార్వతీపురం మండలం పెద్ద బొండపల్లి గ్రామానికి చెందిన పి.సతీష్ దరఖాస్తు అందజేశాడు.
ఫిర్యాదులపై తక్షణమే చర్యలు
పార్వతీపురంటౌన్: స్పందన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని, సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, వారి సమస్యలను చట్ట పరిధిలో తక్షణమే పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ఒ.దిలీప్ కిరణ్ ఎస్బీ సీఐ ఎన్.శ్రీనివాస రావు, ఎస్సై దినకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ నిషాంత్‌కుమార్
Comments
Please login to add a commentAdd a comment