టిడ్కో కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
విజయనగరం: ఏపీ టిడ్కో కాలనీల్లో వీలైనంత త్వరగా అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి ఆయన గురువారం టిడ్కో కాలనీలను పరిశీలించారు. ముందుగా సోనియా నగర్ టిడ్కో కాలనీను సందర్శించారు. విద్యుత్ సదుపాయం, రోడ్లు, తాగునీటి వసతులను టిడ్కో, మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ దాదాపు 90 శాతం మౌలిక వసతుల కల్పన పనులు పూర్తయ్యాయని అధికారులు చెప్పారు. సుమారు 411 ఇళ్లకు విద్యుత్ సదుపాయం కల్పించామన్నారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. తక్షణమే వీధిలైట్లు వేయాలని, ఇళ్లచుట్టూ ప్రహరీ, ఆర్చ్‌ను నిర్మించాలని ఆదేశించారు. కాలనీలో దొంగతనాల నివారణకు పోలీస్ అవుట్‌పోస్టును ఏర్పాటు చేయాలని సూచించారు. పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలన్నారు. ప్రతీ ఇంటికి కుళాయి కనెక్షన్ వేయాలని, నెలాఖరులోగా పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరుకు లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించాలని, ఫిబ్రవరి మొదటికల్లా లబ్ధిదారులంతా ఇళ్లలో నివాసం ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
సారిపల్లి టిడ్కో కాలనీలోని ఇళ్లను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ఇక్కడ 2,880 ఇళ్లను నిర్మించారు. లబ్ధిదారులతో మాట్లాడి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. ఈ కాలనీలో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు రూ.19కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, దానిలో ఇప్పటివరకు రూ.11 కోట్లు వరకు ఖర్చు చేసి పనులను పూర్తి చేశామని తెలిపారు. అప్రోచ్ రోడ్డు, సిసి రోడ్డు, రిటైనింగ్ వాల్ నిర్మాణం కొంత పెండింగ్‌లో ఉందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. గత ఆరునెలలుగా పనులు ఆపివేసినందుకు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పనులను ప్రారంభించాలని, నెల రోజుల్లో అప్రోచ్ రోడ్డును, సుమారు 1.8 కిలోమీటర్ల మేర పెండింగ్‌లో ఉన్న తాగునీటి పైప్‌లైనన్‌ను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తక్షణమే వీధిదీపాలను ఏర్పాటు చేయాలని, రేపటినుంచే పారిశుధ్య పనులను నిర్వహించాలని నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. లబ్ధిదారులతో సమావేశం నిర్వహించి పీఎం సూర్యఘర్ పథకం కింద ఇళ్లకు సోలార్ విద్యుత్ కనెక్షన్ పెట్టుకొనేలా చైతన్యపరచాలని కలెక్టర్ సూచించారు. విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు సమీపంలో నిర్మించిన సబ్ స్టేషన్‌ను శుక్రవారమే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే అదితి చెప్పారు. పేర్లను తొలగించిన లబ్ధిదారులు అప్పట్లో తమకు ప్రభుత్వం అందజేసిన మంజూరు పత్రాలను తీసుకొని తమను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర తూర్పుకాపు కార్పొరేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వి, ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ లక్ష్మణరావు, మెప్మా పీడీ సత్తిరాజు, టిడ్కో ఈఈ డీవీ రమణమూర్తి, విజయనగరం, నెల్లిమర్ల తహసీల్దార్లు కూర్మనాథరావు, సుదర్శన్, నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ అప్పలరాజు, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు పలువురు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment