లక్ష్యాల సాధనపై సమీక్ష
విజయనగరం అర్బన్: సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు బ్యాంకర్లు శతశాతం రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి డీసీబీ, డీఎల్‌ఆర్‌సీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. బ్యాంకుల సహకారంతో అమలు చేస్తున్న వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు, లక్ష్యాల సాధనపై కలెక్టర్ సమీక్షించారు. పీఎంఈజీపీ, పీఎంఎఫ్‌ఎంఈ, సీసీఆర్‌సీ కార్డ్స్, పంట రణాలు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్–2047లో భాగంగా జిల్లాలో ప్రాథమిక రంగంలో ఆదాయాన్ని గణనీయంగా పెంచేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. రబీలో సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఖరీఫ్‌లో సుమారు 2 లక్షల ఎకరాలు సాగవుతుండగా, రబీలో కేవలం 60 వేల ఎకరాలు మాత్రమే సాగవుతోందని చెప్పారు. ప్రధాన మంత్రి విశ్వకర్మయోజన పథకం అమలుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నాబార్డు సహకారంతో బాడంగి మండలం రైతుల గ్రూపు పీపీసీ, డీసీసీబీ, ఆప్కాబ్ నుంచి బెల్లంపొడి తయారీ యూనిట్ స్థాపనకు మంజూరు చేసిన రూ.కోటి 40 లక్షల చెక్కును కలెక్టర్ అందజేశారు. సమావేశంలో డీఆర్‌డీఏ పీడీ కళ్యాణచక్రవర్తి, జెడ్పీ సీఈఓ బి.వి.సత్యనారాయణ, మెప్మా పీడీ సత్తిరాజు, జేడీఏ వి.టి.రామారావు, ఏపీఎంఐపీ పీడీ లక్ష్మీనారాయణ, ఎల్‌డీఎం రమణమూర్తి, నాబార్డు డీడీఎం నాగార్జున, ఇతర శాఖల అధికారులు, బ్యాంకర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment