ఎంఎస్‌ఎంఈ మంత్రి ఇలాకాలో.. పరిశ్రమలకు అథోగతి!
●
పరిశ్రమల మంత్రితో ఏం ఉపయోగం?...
రాష్ట్ర మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ మంత్రి సొంత నియోజవర్గంలో మూతపడిన, మూతపడే పరిస్థితిలో ఉన్న పరిశ్రమల గురించి పట్టించుకోకపోవడం దురదృష్టకరం. ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వం 80కి పైగా ఎకరాల ప్రభుత్వ భూమి తీసుకున్నా ఫుడ్ పార్కు పెట్టలేదు. దానిగురించి ఆలోచించకుండా మరో ఫుడ్‌పార్కు అంటూ ప్రభుత్వ భూమిని దక్కించుకొనే ప్రయత్నాలు సాగుతున్నాయి. జీడిపిక్కల ఫ్యాక్టరీలో ఉపాధి కోల్పోయి వేలాది మంది రోడ్డునపడ్డారు. మరోవైపు భీమసింగి చక్కెర కర్మాగారం తెరిపిస్తామని టీడీపీ నాయకులు చెప్పారు. అదీ లేదు, ప్రత్యామ్నాయం కనిపించట్లేదు. చెరకు రైతులకు కూడా అన్యాయమే చేస్తున్నారు. గత మా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చెరకు రైతులు నష్టపోకుండా ప్యారిస్ సుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుంచి వారానికి ముందే సొమ్ము డిపాజిట్ చేయించి చెరకు పంపించే ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు ముందస్తు డిపాజిట్ కాదు కదా రెండు వారాల తర్వాత పేమెంట్లు చేస్తామన్నా కూటమి నాయకులు ఏమీ చేయలేకపోతున్నారు. నెల్లిమర్ల జ్యూట్ మిల్లు తెరిపించే ప్రయత్నాలు చేయట్లేదు. మరోవైపు ఫెర్రో అల్లాయిస్ పరిశ్రమలను ఆదుకొనే చర్యలు కానరావట్లేదు. పరిశ్రమల మంత్రి జిల్లాలో ఉండి ఏమి ఉపయోగం? కొత్త ఉద్యోగాలు లేక, ఉన్న ఉపాధి పోతుంటే భవిష్యత్తులో మళ్లీ మా గజపతినగరం నియోజకవర్గం నుంచి వలసలు తప్పేట్లు లేదు.
– బొత్స అప్పలనరసయ్య, మాజీ ఎమ్మెల్యే,
వైఎస్సార్‌సీపీ గజపతినగరం
నియోజకవర్గ సమన్వయకర్త
ఇది గజపతినగరం మండలంలోనే మరుపల్లి గ్రామ సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని ఏర్పాటైన ఓలం జీడిపిక్కల పరిశ్రమ. కోవిడ్ వరకూ ఇది బాగానే కొనసాగింది. తొలుత దాదాపు వెయ్యి మంది స్థానికులు ఇక్కడ పనిచేసేవారు. కోవిడ్ తర్వాత నుంచి యాజమాన్యం కార్మికుల సంఖ్య తగ్గిస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ కార్మికులంతా రోడ్డునపడ్డారు. ఈ పరిశ్రమ కూడా ముక్కుతూమూలుగుతూ అన్నట్లుగా ఉంది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం:
ఇంటికో ఉద్యోగం ఇస్తాం... ఇంటింటికో పారిశ్రామికవేత్తను తయారుచేస్తాం... అంటూ టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పెద్దలు ఊదరగొట్టడానికి, అసలు వాస్తవ పరిస్థితికి భిన్నంగా ఉంది. ఇందుకు ఆ ప్రభుత్వంలో మధ్యతరహా, చిన్న పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సొంత నియోజకవర్గం గజపతినగరం పరిధిలోని పరిశ్రమలను పరిశీలిస్తే చాలు... జిల్లాలో పరిస్థితి ఏమిటో కళ్లకు కడుతుంది. ఇప్పటికే మూతపడిన, మూతపడే దశలో ఉన్న పరిశ్రమల గురించి ఏమాత్రం ఆలోచించని కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఫుడ్ పార్కు పేరుతో మరో 80 ఎకరాల భూమిని కారుచౌకగా కొట్టేసే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని తెలిసింది. గత టీడీపీ ప్రభుత్వం ఏపీఐఐసీ ద్వారా మరుపల్లి వద్ద దాదాపు 80 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టింది. అదీ కారుచౌకగా... ఎకరా రూ.5 లక్షల చొప్పున కార్డురేట్‌కు ఇచ్చేశారు. ఇప్పటివరకూ అక్కడ ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇప్పుడా భూమి పరిసరాల్లో ఎకరా రూ.కోటి వరకూ ధర పలుకుతోంది.
ఆవుల పేరుతో డ్రామా
ఫుడ్‌పార్కులో ఆహార పరిశ్రమలను ఏర్పాటుచేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం మూడేళ్లలోగా పరిశ్రమలను పెట్టకపోతే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి ఉంది. దీని నుంచి తప్పించుకోవడానికి అక్కడ చందనా ఫుడ్‌పార్కు పేరుతో 20 వరకూ ఆవులను మేపుతున్నారు. మరో 40 ఎకరాల్లో ఔషధ మొక్కలు పెంచుతున్నట్లు చూపిస్తున్నారు. ఈ ఫుడ్ పార్కు పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మరో ఫుడ్ పార్కు వస్తుందని కూటమి పార్టీల నాయకులు చెబుతున్నారు. మరో 80 ఎకరాల భూమికి ఎసరుపెట్టే ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి.
ఇది జామి మండలంలోని భీమసింగి సహకార చక్కెర కర్మాగారం. చక్కెర పరిశ్రమను ఆదుకుంటామని, సహకార రంగంలోని సుగర్ ఫ్యాక్టరీలను నిలబెట్టి చెరకు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడిగా జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హామీ ఇచ్చారు. ఆయన కుమారుడు లోకేశ్ కూడా ఎన్నికల సభల్లో అదే చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జిల్లాకు చెందిన రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి రైతులకు షాక్ ఇచ్చారు. ఫ్యాక్టరీని తెరిపించడం గాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని చావుకబురు చల్లగా చెప్పారు. కానీ ఇప్పటివరకూ ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు.
ప్రోత్సాహకం ముసుగులో ప్రభుత్వ భూములకు ఎసరు
ఫుడ్ పార్కు పేరుతో 80 ఎకరాల ధారాదత్తానికి సమాలోచనలు
మరుపల్లి వద్ద గత టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే 80 ఎకరాల కేటాయింపు
రాష్ట్ర ఎంఎస్‌ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హామీలన్నీ తుష్
మూతపడిన పరిశ్రమలన్నీ తెరిపిస్తానన్న ఎన్నికల హామీపైనా అయోమయం
స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై వీడుతున్న మబ్బులు
ఇది గజపతినగరం మండలం మరుపల్లి గ్రామ సమీపంలోని ప్రభుత్వ భూమి. టీడీపీ ప్రభుత్వ పాలనాకాలం (2014–19)లో ఫుడ్ పార్కు పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా కట్టబెట్టారనే ఆరోపణలు వచ్చాయి. అక్కడ ఆహార, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ అలాంటి పరిశ్రమ కాదు కదా... ఒక్క ఇటుక కూడా వేయ లేదు. ఓ 40 ఎకరాల్లో కొన్ని ఆవులను మేపుకుంటున్నారు. మరో 40 ఎకరాల్లో మొక్కలు వేసి చూపిస్తున్నారు. ఇదేదీ కార్యరూపం దాల్చకపోయినా ఇప్పుడు టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అక్కడే మరో 80 ఎకరాలను ధారాదత్తం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అదీ ఫుడ్ పార్కు పేరుతోనే కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment