అలా..జల విహారంలో..
● తాటిపూడి రిజర్వాయరులో మళ్లీ బోటింగ్
● సరికొత్త బోట్లతో విహారానికి సిద్ధం
● నేడు ప్రారంభానికి ఏర్పాట్లు
● గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ చొరవతో సాకారం
సాక్షి ప్రతినిధి, విజయనగరం: చుట్టూ పచ్చని కొండలు, వాటిని తాకుతూ వెండి మబ్బులు ఒకవైపు... చల్లని పిల్ల గాలులు తాకుతూ మరోవైపు... అందమైన బోటులో స్వచ్ఛమైన జలాశయంలో విహారం చేస్తుంటే ఎలా ఉంటుంది? ఓహో ఆ ఊహే చాలా బాగుంది కదా? ఉహాల్లోనే కాదు.. స్వయంగా వెళ్లి ఆహ్లాదంగా గడిపిరావచ్చు! ఎక్కడో కాదు మన తాటిపూడి రిజర్వాయరుకు వెళితే చాలు. శుక్రవారమే బోటింగ్ పునఃప్రారంభమవుతోంది.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో తోటపల్లి, తాటిపూడి రిజర్వాయర్లలో బోటింగ్‌కు అవకాశం ఉండేది. నాలుగేళ్ల కిందట గోదావరి నదిలో ప్రమాదం తర్వాత ఇక్కడ కూడా బోటింగ్ కార్యకలాపాలను ప్రభుత్వం నిలిపేసింది. తర్వాత తోటపల్లిలో పునఃప్రారంభించడానికి ప్రయత్నాలు జరిగినా గుర్రపుడెక్క పెద్ద అడ్డంకిగా మారింది. తాటిపూడి జలాశయంలో మాత్రం అలాంటి ఇబ్బందేమీ లేదు. దీంతో ఇక్కడ జలక్రీడలు, బోటింగ్ నిర్వహిస్తే బాగుంటుందని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, గజపతినగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య చొరవ తీసుకున్నారు. వారి కృషి ఫలించింది. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీఎల్) ద్వారా రిజర్వాయరులో బోటింగ్, జలక్రీడల నిర్వహణకు గత ఏడాది జనవరి 9న టెండర్ ప్రకటన విడుదలైంది. ఫిబ్రవరి 2వ తేదీన టెండర్లు ప్రక్రియ పూర్తి అయ్యింది.
వాటర్ స్పోర్ట్స్ సింపిల్ ఇండియా ఆధ్వర్యంలో...
మన రాష్ట్రంలో పలుచోట్ల జలక్రీడలు, బోటింగ్ నిర్వహణలో అనుభవం ఉన్న వాటర్ స్పోర్ట్స్ సింపిల్ ఇండియా సంస్థ టెండర్ దక్కించుకుంది. ఈ మేరకు ఏపీటీడీసీతో 2024 ఫిబ్రవరి 13న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకొని, రిజర్వాయరు వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. అందమైన 13 బోట్లు పర్యాటకులను జలవిహారంలో ఆనందింపజేసేందుకు సిద్ధమయ్యాయి. 20 సీట్ల బోటు ఒకటి, 12 సీట్ల బోటు ఒకటి, ఆరు సీట్ల బోట్లు మూడు, నాలుగు సీట్ల బోట్లు రెండు, చిన్నవి రెండు సీట్ల బోట్లు ఆరు వాటిలో ఉన్నాయి.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ కృషి ఫలితమిది...
పర్యాటకంగా జిల్లాను ముందుకు తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు జరిగాయి. అందులో భాగంగానే తాటిపూడి రిజర్వాయరులో బోటింగ్‌కు, జలక్రీడలకు ఏడాది కిందటే టెండర్ల ప్రక్రియ, ఓ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం పూర్తి అయ్యాయి. బోటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఇప్పుడు ప్రారంభానికి మార్గం సుగమమైంది. పర్యాటకుల భద్రత తొలి ప్రాధాన్యంగా సంస్థ బోటింగ్ నిర్వహణ ఉండాలని ఆశిస్తున్నాం. – మజ్జి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment