క్యాన్సర్ అస్పత్రి ఏర్పాటు ఉత్తరాంధ్రకు మేలు
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామంలో గురుదేవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో విజయశ్రీ ఉప్పలపాటి మెమోరియల్ (యుఎన్‌ఎ)సాయంతో నిర్మాణం చేసిన 100 పడకల క్యాన్సర్ ఆస్పత్రి ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.నిర్మాణం పూర్తయిన ఆస్పత్రిని శృంగవరపుకోట, విజయనగరం ఎమ్మెల్యేలు కోళ్ల లలితకుమారి, అదితి గజపతిలతో కలిసి మంత్రి శ్రీనివాస్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జామి మండలానికి చెందిన ఉప్పలపాటి వెంకటపతిరాజు సుమారు 40 సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడి ఈ ప్రాంత ప్రజలపై మమకారంతో గురుదేవ చారిటబుల్ ట్రస్టు చేస్తున్న సేవలపై అపారనమ్మకంతో ఈ క్యాన్సర్ ఆస్పత్రి నిర్మించి తనతో ప్రారంభింప చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు, ఈ ఆస్పత్రి ఉత్తరాంధ్ర ప్రజలకే కాకుండా దేశంలో ఉన్న క్యాన్సర్ బాధితులకు ఎంతగానో ఉపయోగ పడుతుందని అభిప్రాయపడ్డారు. ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు మాట్లాడుతూ ఈ అస్పత్రి నిర్మాణానికి ఉప్పలపాటి మెమోరియల్ పౌండేషన్ వ్యవస్థాపకుడు ఉప్పలపాటి వెంకటపతిరాజు రూ.15 కోట్ల వరకు సాయం అందించారని తెలిపారు. ఆస్పత్రిలో అత్యాధునిక కీమోథెరపీ, ఐసీయూ వంటి సదుపాయాలు ఏర్పాటు చేశామని, అతి తక్కవ ధరలకే క్యాన్సర్ రోగులకు చికిత్స అందిస్తామన్నారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, ఉప్పలపాటి మెమోరియల్ ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
Comments
Please login to add a commentAdd a comment