ముంచెత్తిన వాన
విజయనగరం ఫోర్ట్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. తెరిపివ్వకుండా వాన కురవడంతో పల్లపు పొలాల్లో నీరు చేరింది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన వరి, అపరాల పంటలను ముంచెత్తింది. వరి పనలు నీటమునిగాయి. కొన్నిచోట్ల కుప్పలకు సగం వరకు వర్షపునీరు చేరింది. రైతుల గుండె బరువెక్కుతోంది. ధాన్యం రంగు మారి మొలకలు వస్తాయన్న ఆవేదన వెంటాడుతోంది. ఫెంగల్ తుఫాన్ వల్ల జరిగిన నష్టం నుంచి తేరుకోకముందే వాయుగుండం కారణంగా కురిసిన వర్షాలు వరి రైతు నడ్డివిరిచాయాంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
కుప్పల రూపంలోనే...
జిల్లాలో ప్రస్తుతం వరి పంట 1.25 లక్షల ఎకరాల్లో పొలంలో కుప్పల రూపంలో ఉంది. 95 వేల ఎకరాల్లో వరి పంట కోసి పొలంలో పనలపై ఉంది. 1.11 లక్షల ఎకరాల్లో నూర్పులు పూర్తయ్యాయి. వీటి ద్వారా 2.27 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో 1.83 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. ఇంకా 44 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం పొలాల్లో నీరు చేరడంతో వరి నూర్పులు మరింత ఆలస్యం కానున్నాయి. మరోవైపు 11,711 హెక్టార్లలో సాగుచేసిన అపరాలు (పెసర, మినుము) పంటలు నీట మునిగాయి.
నీటమునిగిన వరి పంట
జిల్లాలో 95 వేల ఎకరాల్లో పనల
రూపంలో వరి
1.25 లక్షల ఎకరాల్లో వరి కుప్పల రూపంలో పొలాల్లోనే..
శుక్రవారం నమోదైన వర్షపాతం ఇలా..
మెంటాడ 62.3 మి.మీ
బొండపలి 48.1 మి.మీ
గంట్యాడ 43.6 మి.మీ
నెలిమర్ల 44.1 మి.మీ
రామభద్రపురం 42.9 మి.మీ
బాడంగి 43.2 మి.మీ
Comments
Please login to add a commentAdd a comment