వీరభద్రపురం పాఠశాల ఉపాధ్యాయుడిపై వేటు
● పాఠశాల హెచ్‌ఎంకు మెమో జారీ
కొత్తవలస: మండలంలోని వీరభద్రపురం గ్రామ ఎంపీయూపీ పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు జె.వి.సన్యాసిరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్టు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు శుక్రవారం తెలిపారు. సహచర ఉపాధ్యాయిని పట్ల అసభ్యకరణ ప్రవర్తన, కులంపేరుతో అవమాన పర్చడం, విద్యార్థులపై అసభ్యకర ప్రవర్తన, వీడియోలు చూపడం వంటి ఆరోపణలపై సన్యాసిరావుపై వేటు వేసినట్లు డీఈఓ తెలిపారు. పాఠశాల హెచ్‌ఎం బి.శ్రీనివాసరావును హెచ్‌ఎం విధుల నుంచి తప్పించి మెమో జారీచేశామన్నారు.
ఆ పాదముద్రలు పులివి కావు
సంతకవిటి: మండలంలోని శ్రీహరినాయుడుపేట గ్రామ పొలాల్లో జంతువు పాదముద్రలను కొందరు రైతులు గమనించారు. పులి పాదముద్రలుగా అనుమానించి పొలాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు. సమాచారం అందుకున్న విజయనగరం డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బి.సుబ్బారావు, బీట్ ఆఫీసర్ రామారావు శుక్రవారం పొలాలను సందర్శించి పాదముద్రలను పరిశీలించారు. పులివి కావని, ఇవి పెద్ద నక్క, లేదంటే దుమ్మలగుండు పాదముద్రలు అయి ఉండవచ్చని తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదన్నారు.
అవార్డును అందుకున్న కమిషనర్
విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ ఆధ్వర్యంలో ఇంధన పరిరక్షణ మిషన్ ప్రకటించిన సిల్వర్ అవార్డును విజయనగరం కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య విజయవాడలో శుక్రవారం అందుకున్నారు. ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.విజయానంద్ అవార్డులను ప్రదానం చేశారు. ఇంధన పొదుపు అవార్డులకు రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు పోటీ పడగా తాడిపత్రి మున్సిపాలిటీ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నల్లనయ్య మాట్లాడుతూ ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో విజయనగరం కార్పొరేషన్‌కు సిల్వర్ అవార్డు రావడం ఆనందంగా ఉందన్నారు. అవార్డు వచ్చేలా పనిచేసిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో విజయనగరం కార్పొరేషన్ డీఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
సెంచూరియన్‌లో
నేడు 4వ స్నాతకోత్సవం
● 201 మంది విద్యార్థులకు డిగ్రీల ప్రదానం
● 16 మందికి బంగారు పతకాలు
● చాన్సలర్ జీఎస్‌ఎన్ రాజు వెల్లడి
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో 4వ స్నాతకోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశామని చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్‌ఎన్‌రాజు తెలిపారు. వర్సిటీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉదయం 11 గంటలకు ప్రారంభంకానున్న స్నాతకోత్సవ వేడుకులకు నయంత విశ్వవిద్యాలయం సీఈఓ డాక్టర్ రంజన్ బెనర్జీ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, తదితర విభాగాల్లో 201 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేయడంతో పాటు ఐదుగరు విద్యార్థులకు పీహెచ్‌డీ, 16 మందికి బంగారు పతకాలు, మరో 8 మందికి రూ.10వేలు చొప్పున ప్రొత్సాహకాలు అందజేస్తామని వివరించారు. 2030 నాటికి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని మొదటి స్థానంలో నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. వైస్ చాన్సలర్ పీకే మహంతి మాట్లాడుతూ వర్సిటీలో విద్యార్ధులకు నైపుణ్యంతో కలిగిన విద్యను అందజేస్తున్నామన్నారు. పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అవసరమైన చర్యలను తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment