గోదాములో బియ్యం దొంగలు!
మెరకముడిదాం: అది రాష్ట్ర గిడ్డంగులసంస్థ గోదాం. అక్కడ రేషన్ డిపోలకు సరఫరా చేసే బియ్యంను నిల్వ చేస్తారు. ఇదే.. అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి వరంగా మారింది. ప్రతీ బస్తాకు 2 నుంచి 3 కిలోల వరకు కన్నంపెడుతున్నారు. వేలాది బస్తాల నుంచి బియ్యంను దొంగిలించి సొమ్ముచేసుకుంటున్నారు. రేషన్ డీలర్లకు నష్టం చేకూర్చుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మెరకముడిదాం మండలం భైరిపురం గ్రామం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాం ఉంది. ఇక్కడ రేషన్ బియంతోపాటు మొక్కజొన్నను నిల్వ చేస్తారు. ఇక్కడ నుంచి ఎంఎల్‌ఎస్ పాయింట్లకు, రేషన్‌దుకాణాలకు పౌరసరఫరాల అధికారులు బియ్యం సరఫరా చేస్తుంటారు. ఇక్కడ స్టాకు చేసిన వేలాది బియ్యం బస్తాలకు ఇక్కడ పనిచేస్తున్న కొందరు సిబ్బంది ‘శంకు’ అనే వస్తువుతో రంధ్రాలను చేసి బియ్యం దొంగిలిస్తున్నారు. ప్రతి బస్తా నుంచి రెండు నుంచి మూడు కిలోల వరకు బియ్యం తీశాక గోనెలు సరిచేసి రంధ్రాలను కప్పివేస్తున్నారు. వేల కిలోల బియ్యాన్ని వేరేగా బస్తాలకు ఎత్తి వాటిని ఎవరికంటా పడకుండా రాత్రి వేళల్లో తరలిస్తున్నా రు. రేషన్ డీలర్లకు నష్టం చేకూర్చుతున్నారు. బియ్యాన్ని దొంగిలిస్తున్న విషయం అధికారులకు తెలిసినా నిమ్మకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వందల కిలోల బియ్యంను అధికారులకు తెలియకుండా అక్రమార్కులు తీసేయడం కష్టసాధ్యమన్న వాదన వినిపిస్తోంది. జిల్లా ఉన్నతాధికారులు దృష్టిసారిస్తే బియ్యం దొంగల బాగోతం బయటపడుతుందని కొందరు బహిరంగంగానే చెబుతున్నారు. గోదాంలో బియ్యం దొంగతనం వ్యవహారాన్ని మేనేజర్ కె.అప్పారావు వద్ద ప్రస్తావించగా గోదాంలో స్టాకు ఉంచడం వరకే మా పని అని, ఎలాంటి అక్రమాలు జరగడంలేదని సెలవిచ్చారు.
బస్తాల నుంచి బియ్యం తీసేస్తున్న వైనం
అంతా గోదాం సిబ్బంది కనుసన్నల్లోనే..
ఒక్కో బస్తాకు 2 నుంచి 3 కిలోల తరుగు
పట్టించుకోని గోదాం అధికారులు
నష్టపోతున్న డీలర్లు
Comments
Please login to add a commentAdd a comment