బొబ్బిలిలో పుష్పరాజ్..!
● అటవీ సంపదకు కాళ్లు ● యథేచ్ఛగా సామిల్లులకు చేరుస్తున్న టేకు దుంగలు
బొబ్బిలి రూరల్:
మండల పరిసర ప్రాంతాల్లోని అటవీసంపద ఇప్పటికే అక్రమార్కుల వశమైపోగా ఉన్న వాటికి ఆనవాళ్లు లేకుండా చేసే పనిలో పడ్డాడు బొబ్బిలి ప్రాంత పుష్పరాజ్. తగ్గేదేలే అంటూ ప్రతి ఆదివారం విలువైన టేకుచెట్లను తెగనరికి దుంగలుగా మార్చి పట్టణ సమీపంలోని సామిల్లులకు ట్రాక్టర్లతో తరలిస్తున్నాడు. ఉదయం రెండు లోడ్లయితే చీకటిపడ్డాక మరో మూడు ట్రాక్టర్ల టేకు దుంగలను యథేచ్ఛగా ఆర్టీసీ కాంప్లెక్స్ ముందునుంచే సామిల్లులకు తరలించేస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నుంచే టేకు చెట్లను నరికే బ్యాచ్‌లు విడివిడిగా నరకడం, అనంతరం తెల్లవారుజామున కొన్ని, సాయంత్రం చీకటి పడ్డాక కొన్ని లోడ్ల సరుకును సామిల్లులకు తరలించేస్తున్నారు. మండలంలోని కాశిందొరవలస, మోసూరువలస తదితర గ్రామాల్లో ఉన్న అడవుల్లో ఈ వ్యాపారం కొన్నాళ్లుగా సాగుతోంది. దీనికి సంబంధించి రెవెన్యూ శాఖ నుంచి ఓ వీఆర్‌ఓ పూర్తిసహాయ సహకారాలందిస్తున్నట్లు సరుకును అన్‌లోడ్ చేస్తున్న పుష్పరాజ్ అనుచరులు బాహాటంగానే చెబుతున్నారు. ఆ పుష్పరాజ్‌కు రాజకీయ నాయకులు, ఉన్నతస్థాయిలో అధికారులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు, విలువైనవి ఏవి దొరికినా వదలొద్దని తరలించుకోమని భరోసా కల్పించారన్న తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
శివడవలసలో..
మండలంలోని శివడవలస గ్రామ సమీపంలో ఉన్న మజ్జిగౌరి సామిల్లులో టేకు దుంగలు దింపుతున్న ట్రాక్టర్ కనిపించింది. దుంగలను అన్‌లోడ్ చేస్తున్న కూలీలను ఎక్కడి నుంచి తెచ్చారు, ఎవరు పంపారని అడగ్గా వారి దగ్గర సమాధానం లేదు. దీంతో ఆ సామిల్లులో ఎవరూ ఉండకూడదని వెళ్లిపోవాలని సామిల్లు యజమాని వారికి ఫోన్‌లో సమాచారం ఇవ్వడంతో అక్కడినుంచి ఉడాయించారు. దీనిపై అటవీశాఖ బీట్ ఆఫీసర్ స్వప్నను వివరాలు అడగ్గా రహదారిపై ఉన్న వాహనాలను అపే అధికారం తనకు లేదని, సామిల్లులకు సరుకు చేరిపోతే రేంజర్ స్థాయి అధికారులే ఉండాలన్నారు. సంబంధిత కలప రవాణాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని, రేంజర్‌తో వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేస్తామని వివరించారు. దీనిపై డీఆర్‌ఓ సుఽఽధీర్ కోసం ప్రయత్నించగా ఆయన సెల్ చార్జింగ్ పెట్టి బయటకు వెళ్లినట్లు సిబ్బంది సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment