● శిథిలావస్థలో పశువైద్య సేవాకేంద్రాలు ● జిల్లాలో ఖాళీగా
రాజాం :
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం అన్ని రంగాలను దెబ్బతీస్తోంది. సంక్షేమ పథకాలు అందించడంలో విఫలమైన సర్కారు అటు ప్రజలకు, ఇటు రైతులకు మెరుగైన సేవలు కూడా అందించలేకపోతుంది. జిల్లాలో అత్యధికంగా పాడి పరిశ్రమ ను నమ్ముకుని జీవనం సాగిస్తున్న రైతులకు కూట మి పాలనలో కష్టాలు ఎదురౌతున్నాయి. పశువైద్యంపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చొరవ చూపి ప్రతీ సచివాలయ పరిధిలో విలేజ్ వెటర్నరీ అసిస్టెంట్‌లు నియామకం, రైతు భరోసా కేంద్రాలు వద్ద పశువైద్య సేవలు అందజేసింది. ఈ ప్రభుత్వం అందులో పదిశాతం సేవలు కూడా పశు పరిశ్రమ అభివృద్ధికి కేటాయించడం లేదు.
శిథిలావస్థలో భవనాలు
జిల్లా వ్యాప్తంగా పశు సంవర్థక శాఖ భవనాలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రధానంగా అసిస్టెంట్ డైరెక్టర్లు, మండల పశువైద్య కేంద్రాల భవనాలు అధోగతిలో కొట్టుమిట్టాడుతున్నాయి. పలు చోట్ల వైద్యులు కొరత స్పష్టంగా కనిపిస్తోంది. వైద్యులతో పాటు సిబ్బంది నియామకాలు లేకపోవడంతో పశువైద్య కేంద్రాల నిర్వహణ తూతూ మంత్రంగానే కొనసాగుతోంది. శిథిల భవనాలు స్థానంలో కొత్త నిర్మాణాలు లేకపోవడం, రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో నిల్వ ఉంచాల్సిన మందులను అధికారులు తీసుకురావడం లేదు.
చాలీచాలని మందులు
గతంలో పశువైద్య కేంద్రాల్లో అన్ని రకాల మందు లు అందుబాటులో ఉంచేవారు. ప్రస్తుతం అరకొర మందులతోనే కాలం గడుపుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పాడి పరిశ్రమకు వైద్య సేవలు అందించేందుకు సంచార పశువైద్య వాహనాలు ప్రతీ వారంలో ఒక రోజు పంచాయతీల్లో పర్యటించేవి. ప్రస్తుతం వాటి సేవలు అటకెక్కాయి. పాడి పశువులతో పాటు పెంపుడు జంతువుల సంరక్షణ నిమిత్తం అందించాల్సిన సేవలకుగానూ పశువైద్య కేంద్రాల్లో పరికరాలు లేవు. కేవలం మందులు, ఆయింట్‌మెంట్‌లు ద్వారానే వైద్యం కొనసాగుతోంది. అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయాల్లో కాంపౌండర్, సిబ్బంది కొరత ఉండడంతో గ్రామాల్లోని వీవీఏలను ఆయా కేంద్రాల్లో డెప్యుటేషన్‌పై వేసి సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో పశువులకు సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నాయి. కనీసం బీమా కూడా లేకపోవడంతో పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు వాటిని వదిలేసి, వేరే ఉపాధి మార్గాలు అన్వేసిస్తున్నాయి. ఫలితంగా పాడి పరిశ్రమ తగ్గుముఖం పడుతోంది. ఈ సేవలు మందగించడంతో పాడి పశువులే కాకుండా గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకందారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
సిబ్బంది కొరత వాస్తవమే..
పశువైద్య కేంద్రాలతో పాటు గ్రామీణ వెటర్నరీ అసిస్టెంట్‌లు ఖాళీలపై జిల్లా అధికారులకు నివేదికలు అందించాం. త్వరలో భర్తీ చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఖాళీగా ఉన్న కేంద్రాల్లో డెప్యుటేషన్ పద్ధతిలో వైద్యులను నియమించి, పాడి పరిశ్రమకు సేవలు అందిస్తున్నాం.
– బి.జయప్రకాష్, పశుసంవర్థక శాఖ ఏడీఏ
Comments
Please login to add a commentAdd a comment