ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై దర్యాప్తు
మెంటాడ: ఆండ్ర ఎస్‌ఐ కె.సీతారాం ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఎంపీపీ రెడ్డి సన్యాసినాయుడు, పిట్టాడ సర్పంచ్ కాపారపు పైడిపునాయుడు, వైస్ ఎంపీపీ సారికి ఈశ్వరరావు జెడ్పీ సీఈఓకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలంటూ తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు, ఎంపీడీఓ భానుమూర్తిని ఆయన ఆదేశించారు. దీంతో మెంటాడ తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదుదారుల నుంచి బుధవారం వివరాలు సేకరించారు. ఎస్‌ఐ ఎన్నికల కోడ్ ఉల్లంఘన తీరును అడిగి తెలుసుకున్నారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని విచారణ అదికారులు తెలిపారు.
మెంటాడ పీహెచ్‌సీని
పరిశీలించిన డీఎంహెచ్‌ఓ
మెంటాడ /చీపురుపల్లి: మెంటాడ పీహెచ్‌సీని డీఎంహెచ్‌ఓ జీవనరాణి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మందుల నిల్వల వివరాలను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వాటికి సంబంధించిన రికార్డులు, నిల్వలను పరిశీలించారు. ఆస్పత్రికి వచ్చే రోగులను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేయాలన్నారు. ఆమె వెంట వైద్యులు జె.లోకప్రియ, జి.కల్పన ఉన్నారు.
భయాందోళన చెందవద్దు
గుర్ల మండల కేంద్రంలో డయేరియా కేసులు నమోదుకాలేదని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా.ఎస్.జీవనరాణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామంలో వివిధ ఆరోగ్య కారణాలతో ఒకే రోజు ఒకరి తర్వాత మరొకరు చొప్పున ముగ్గురు మృతిచెందడంపై ‘గుర్లలో మృత్యు ఘోష’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించారు. ఇప్పటికే గుర్ల పీహెచ్‌సీ వైద్యాధికారి పారామెడికల్ సిబ్బందితో ఇంటింటి సర్వే నిర్వహించారని, డయేరియా లక్షణాలు బయటపడలేదన్నారు.
ప్రకృతి సాగు పరిశీలన
వేపాడ: మండలంలోని ఆకులసీతంపేట గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగుచేస్తున్న పంటలను శ్రీలంక రైతు బృందం బుధవారం పరిశీలించింది. తొలుత ప్రాథమిక పాఠశాలలో న్యూట్రీగార్డెన్‌ను సందర్శించారు. పంటలను ఆశించే చీడపీడల నివారణకు వివిధ పత్రాలతో కషాయాల తయారీని ప్రయోగాత్మకంగా తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం లాభదాయకమని, ఆరోగ్యకర పంటలను ఉత్పత్తిచేయవచ్చని డీపీఎం ఆనందరావు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment