సింగిల్ విండో విధానంలో పరిశ్రమలకు అనుమతి
విజయనగరం అర్బన్: జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తూ సింగిల్ విండో విధానంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఇకపై ప్రతినెలా 5వ తేదీన పరిశ్రమల, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశం నిర్వహించి త్వరగా అనుమతులు వచ్చేలా చూస్తామన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించిన జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆరు నెలల కాలంలో సింగిల్ విండో విధానంలో 221 పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తులు అందగా 195 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేశామన్నారు. కాలుష్య నియంత్రణ మండలి వద్ద పెండింగ్ ఉన్న దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలని ఈఈని ఆదేశించారు.
బొబ్బిలి గ్రోత్ సెంటర్‌లో పరిశ్రమల ఏర్పాటుకు స్థలాల కేటాయింపు పొందిన సంస్థలు పరిశ్రమల ఏర్పాటుకు గడువు పెంచాలన్న అభ్యర్థన మేరకు ఏడు పరిశ్రమలకు ఏడాది వరకు సమయం ఇస్తూ ప్రోత్సాహక మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. జిల్లా స్థాయి కమిటీలో సభ్యులుగా ఉన్న పలువురు జిల్లా స్థాయి అధికారులు సమావేశానికి హాజరుకాకపోవడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరుకాలేని అధికారులు ఇకపై ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల ఇన్‌చార్జ్ అధికారి మధుసూధన్ రెడ్డి, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ మురళీమోహనరావు, కాలుష్య నియంత్రణ మండలి ఈఈ సరిత, డీఆర్‌డీఏ పీడీ కళ్యాణ్ చక్రవర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను త్వరగా
పరిష్కరించాలి
కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్
Comments
Please login to add a commentAdd a comment