ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను శక్తి వంచన లేకుండా పరిష్కరిస్తానని మాజీ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ అభ్యర్థి గాదె శ్రీనివాసుల నాయుడు అన్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన తర్వాత కలెక్టరేట్ ప్రాంగణంలో శ్రీనివాసుల నాయుడు మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ఎమ్మెల్సీగా పనిచేసిన సమయంలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కరించడంలో కీలకంగా పని చేశానన్నారు. తనకు పలు ఉపాధ్యాయుల సంఘాల మద్దతు ఉందని తెలిపారు. కాగా.. ఆర్టీసీ కాంప్లెక్స్‌కు సమీపంలోని ప్రైవేట్ పంక్షన్‌లో హాలులో ఉపాధ్యాయులతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ, మిత్ర సంఘాలు ఏపీటీఎఫ్ 1938, ఏపీ యూఎస్, ఎస్టీయూ, ఏపీటీడబ్ల్యూటీఏ, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, పీఈటీ అసోసియేషన్, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏపీటీఏ), గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్, కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్స్ అసోసియేషన్, జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ అసోసియేషన్‌లు శ్రీనివాసుల నాయుడుకు మద్దతు ప్రకటించాయి.
పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మిట్ట కృష్ణయ్య, ఏఎం గిరిప్రసాద్ రెడ్డి, రాష్ట్రస్థాయి నాయకుడు వైష్ణవ కరుణానిధి, ఏపీటీఎఫ్(1938) రాష్ట్ర అధ్యక్షుడు హృదయ రాజు, ఆపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, ఎస్టీయూ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఇమంది పైడిరాజు, పీఆర్టీయూ ఉమ్మడి జిల్లా కన్వీనర్ డి.గోపీనాథ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నాయకుడు పి.వి.ఎన్.మాధవ్ సమావేశంలో పాల్గొని.. రాజకీయాలకు అతీతంగా.. ఉపాధ్యాయుల సమస్యలపై పట్టు ఉన్న గాదె శ్రీనివాసుల నాయుడును ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఆరు జిల్లాలకు సంబంధించిన అన్ని సంఘాల అధ్యక్ష కార్యదర్శులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment