![మూణ్న](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/exportwizard-1copy_mr-1738955454-0.jpg.webp?itok=XkDketbW)
మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం!
‘కొత్తవలస మండలానికి చెందిన ఓ వ్యక్తికి గరివిడి మండలానికి చెందిన మహిళతో వివాహం అయింది. రెండు సంవత్సరాల పాటు సంతోషంగా జీవించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. అక్కడ కౌన్సెలింగ్ ఇచ్చినా వారు కలిసి జీవించడానికి ఇష్ట పడలేదు. ఇద్దరూ విడాకులు తీసుకున్నారు.’
‘విజయనగరం పట్టణానికి చెందిన యువతీయువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రెండేళ్లపాటు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. ఐసీడీఎస్ కార్యాలయంలో ఉన్న గృహహింస విభాగాన్ని ఆశ్రయించారు. వారు ఇరువురికి కలిసి జీవించాలని కౌన్సెలింగ్ ఇచ్చినా వారి ప్రవర్తన, నిర్ణయంలో మార్పురాలేదు. ఇద్దరూ విడిపోయారు.’
విజయనగరం ఫోర్ట్:
జీవితాంతం కలిసిమెలసి జీవిస్తామని అగ్నిసాక్షిగా ఒక్కటైన కొందరు దంపతులు... పెళ్లి ముచ్చట తీరకముందే గొడవలు పడుతున్నారు. ప్రేమ, ఆప్యాయతలతో ఆనందంగా ఉండాల్సి వారు అపోహలు, అనుమనాలతో విడిపోతున్నారు. నీవే నా ప్రాణం, నీవు లేకపోతే చచ్చిపోతానంటూ పెళ్లి అయిన తొలినాళ్లలో ఎంతో ప్రేమ చూపే వారు, ఆ తర్వాత వాటిన్నంటిని మరిచిపోయి ఒకరిపై ఒకరు ఛీదరించుకోవడం, కోపపడడం.. చివరకు విడాకులు వరకు వెళ్తున్నారు. కొందరు చిన్నచిన్న విభేదాలు, వివాదాలతో కోర్టుకు ఎక్కుతుంటే.. మరికొందరు కక్షకార్పణ్యాలతో రగిలిపోతున్నారు. జీవితాంతం కలిసి జీవించాల్సిన భార్యాభర్తలు తమ బంధాలను బలహీనపర్చుకుంటున్నారు. గృహహింస విభాగం సిబ్బంది, పోలీసులు కౌన్సెలింగ్‌తో కొందరు సర్దుకుపోతున్నారు. మరి కొందరు అయితే మూర్ఖంగా వ్యవహరించి భవిష్యత్తును అంధకారం చేసుకోవడంతో పాటు వారి పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలను దూరం చేస్తున్నారు. తరచూ ఇటువంటి ఘటనలు చోటు చేసుకోవడంతో పెళ్లి అంటేనే ఆడ, మగపిల్లలు, తల్లిదండ్రులు ఆలోచనలో పడుతున్నారు.
● కౌన్సెలింగ్ ఇచ్చినా...
వివిధ కారణాలతో విడిపోయేందుకు సిద్ధపడుతున్న దంపతులను కలపడానికి ఎన్ని కౌన్సెలింగ్‌లు ఇచ్చినా ఫలితం లేకుండా పోతోంది. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై చిన్న కుటుంబాలు ఏర్పడడం వల్ల సంప్రదాయాలు, సత్సంబంధాలు గురించి తెలియడం లేదు. ఒకరి నిర్ణయాలకు ఒకరు గౌరవించుకోకపోవడం, మొండి వైఖరితో భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని పోలీసులు, గృహహింస కౌన్సెలింగ్ విభాగం సిబ్బంది చెబుతున్నారు.
ఎవరికి వారే మొండిపట్టు
గతంలో సంప్రదాయాలను గౌరవిస్తూ ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌర విస్తూ పిల్లలకు ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా నిలిచేవారు. ఏవైనా సమస్యలు వస్తే ఉమ్మడి కుటుంబాలు కావడంతో ఇద్దరికీ సర్దిచెప్పి వారి మధ్య మనస్పర్థలను తొలగించేందుకు కుటుంబ పెద్దలు ప్రయత్నించేవారు. అప్పటికీ మాట వినకపోతే ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి భార్యభర్తలు ఇద్దరినీ ఒక్కటి చేసేవారు. ప్రస్తుత పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. పెద్దలమాటను గౌరవించని, సమాజ విలువలు పాటించని, వివాహబంధాలను లెక్కచేయని యువతీయువకులు వివాదాల్లో చిక్కుకుని, కుటుంబ సభ్యులను మనోవేదనకు గురిచేస్తున్నారు.
వేరు కాపురాలపై ఆసక్తి
ఉమ్మడి కుటుంబంలో కలిసి జీవించేందుకు అధికశాతం మంది యువతులు సుముఖత చూపడం లేదు. అదేమని అడిగితే అత్తమామాలు, ఆడపడుచుల దెప్పి పొడుపులు ఉంటాయని చెబుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ కుమార్తెకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలని ఆలోచిస్తున్నారు. ఉమ్మడి కుటుంబంలో తమ కుమార్తె హాయిగా జీవించగలదనే భరోసా కల్పించలేకపోతున్నారు. కారణం ఏదైనా చిన్న కుటుంబంగా జీవించడం అలవాటు పడుతున్న నేటి పరిస్థితుల్లో ఉమ్మడి కుటుంబాలకు ససేమిరా అంటున్నారు. ఇది కూడా పండంటి కాపు
రాలకు అవరోధంగా మారింది.
బలహీన పడుతున్న వివాహ బంధాలు
పెళ్లి అయినా కొన్నిరోజులకే విడిపోతున్న జంటలు
2024లో గృహహింస విభాగాన్ని
ఆశ్రయించిన 98 మంది
వీరిలో 15 మంది మాత్రమే కౌన్సెలింగ్‌లో రాజీ
83 కేసులు కోర్టుకు...
వీరిలో ఆరుగురు కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నారు
77 కేసులు పెండింగ్‌లోనే..
గొప్పలకు పోయి...
ప్రస్తుత పరిస్థితుల్లో అధికమంది దంపతులు ఉన్నత చదువులు చదువుకున్న వారే. ఆర్భాటాలు, గొప్పలకు పోయి జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. కుటుంబ జీవితంపై అవగాహన కలిగి ఉండాలి. ఉన్నంతలో సర్దుకుపోవడానికి ప్రయత్నించాలి. పిల్లలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి. కుటుంబ వ్యవస్థకు ప్రతీఒక్కరూ ప్రాధాన్యమివ్వాలి. వివిధ కారణాలతో గృహ హింస విభాగాన్ని ఆశ్రయించే వారికి వీటినే బోధిస్తున్నాం. సాధ్యమైనంత వరకు కలిపేందుకు ప్రయత్నిస్తున్నాం. అప్పటికీ రాజీ పడని వారికి కోర్టులో కేసు ఫైల్ చేస్తాం.
– జి.రజని,
గృహహింస విభాగం కౌన్సిలర్
వివిధ కారణాలతో...
పెళ్లయిన కొద్ది రోజులకే భర్త పట్టించుకోవడంలేదని, అత్తమామలు, ఆడపడుచులు వేధిస్తున్నారని మహిళలు గృహ హింస విభాగాన్ని ఆశ్రయిస్తున్నారు. మరి కొంతమంది పోలీస్ స్టేషన్‌లో కేసు పెడుతున్నారు. మరి కొందరు నేరుగా కోర్టులో కేసు పెడుతున్నారు. గతేడాది 98 మంది గృహ హింస విభాగాన్ని ఆశ్రయించారు. వీరిలో 15 మంది గృహహింస విభాగం సిబ్బంది ఇచ్చిన కౌన్సెలింగ్‌లో రాజీ పడ్డారు. కోర్టులో 83 మంది కేసులు ఫైల్ చేశారు. వీరిలో ఆరుగురు కోర్టు ద్వారా విడాకులు సైతం తీసుకున్నారు. 77 మంది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
![మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం! 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/male_mr-1738955454-1.jpg)
మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం!
![మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం! 2](https://www.sakshi.com/gallery_images/2025/02/8/ladydd_mr-1738955454-2.jpg)
మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం!
![మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం! 3](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07vzg16-370049_mr-1738955454-3.jpg)
మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం!
![మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం! 4](https://www.sakshi.com/gallery_images/2025/02/8/love_mr-1738955455-4.jpg)
మూణ్నాళ్ల ముచ్చటగా.. మూడుముళ్ల బంధం!
Comments
Please login to add a commentAdd a comment