డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌ | - | Sakshi
Sakshi News home page

డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌

Published Wed, Nov 20 2024 1:20 AM | Last Updated on Wed, Nov 20 2024 1:20 AM

డిసెం

డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌

వనపర్తిటౌన్‌: డిసెంబర్‌ 14న నిర్వహించే మెగా జాతీయ లోక్‌అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా చూడాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్‌ సునీత కోరారు. మంగళవారం జిల్లా కోర్టు ఆవరణలో పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రాజీకి అనుకూలంగా ఉన్న క్రిమినల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌, ఎకై ్సజ్‌, డ్రంకెన్‌డ్రైవ్‌, చలానా, చిన్న చిన్న కేసులు పరిష్కరించుకునేందుకు లోక్‌ అదాలత్‌ను వినియోగించుకునేలా చూడాలన్నారు. రాజీతో ఇరువర్గాలకు మేలు చేకూరడమేగాక ప్రశాంతంగా జీవించవచ్చని చెప్పారు. ఈ నెల 23, 30, వచ్చే నెల 7న ముందస్తు లోక్‌అదాలత్‌లు జరుగుతాయని తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి వి.రజని, న్యాయమూర్తులు రవికుమార్‌, బి.శ్రీలత, వై.జానకి, డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

హెల్మెట్‌ విధిగా

ధరించాలి : ఎస్పీ

వనపర్తి: ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించాలని ఎస్పీ రావుల గిరిధర్‌ సూచించారు. మంగళవారం జిల్లాకేంద్రంలో ప్రేమ్‌ టైలర్స్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఎస్పీ హాజరై పలువురికి ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. వాహనదారులు సురక్షితంగా తమ గమ్యాన్ని చేరేందుకు హెల్మెట్‌ ధరించాలన్నారు. రెండు జతల దుస్తులు కుట్టించుకున్న వారికి ఉచితంగా హెల్మెట్‌ అందిస్తున్నట్లు నిర్వాహకుడు మన్యం తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ కృష్ణా, ఎస్‌ఐలు హరిప్రసాద్‌, జలంధర్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఏఎస్సై నిరంజన్‌, రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ప్రెసిడెంట్‌ చిన్నమ్మ థామస్‌, సఖి సెంటర్‌ కార్యనిర్వాహకురాలు కవిత తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులు పురాణాల గురించి తెలుసుకోవాలి

వనపర్తి టౌన్‌: భారతీయ సమాజంలో ఇమిడి ఉన్న పురాణాల గురించి విద్యార్థి లోకం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలుగుభాషా సంరక్షణ సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కె.నారాయణరెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కర్ణుడు, ద్రోణుడు, శ్రీరాముడు, ఆంజనేయుడు, అర్జునుడు, అభిమన్యుడు తదితర మహనీయుల వ్యక్తిత్వం తెలిపే సమగ్ర పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేసి మాట్లాడారు. పురాణ పురుషుల గురించి విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకుంటే కార్యసాధన, వ్యక్తిత్వం, సారవంతమైన జీవితాన్ని గడపవచ్చని వివరించారు. మానవ, నైతిక విలువలు అబ్బుతాయని, తద్వారా సమాజం మెరుగుపడుతుందన్నారు. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా స్థిరత్వంగా ఉండేందుకు రామాయణం, భారతం, భాగవతాలు మనిషిని నిలబెడుతాయన్నారు. కార్యక్రమంలో వ్యాఖ్యాత డీవీవీఎస్‌ నారాయణ, రాజవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.

‘మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం’

వనపర్తి రూరల్‌: మతోన్మాద శక్తుల నుంచి తెలంగాణాను కాపాడుకుందామని సీపీఎం జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడారు. శ్రామికుల ఐక్యతను బలోపేతం చేస్తూ మత సామరస్యాన్ని కాపాడుకుందామన్నారు. వామపక్ష పార్టీల రాష్ట్ర కమిటీలు ఇచ్చిన పిలుపు మేరకు 24వ తేదీన జిల్లాకేంద్రంలోని యాదవ భవన్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రజల మధ్య మతపరమైన విభేదాలు పెంచేందుకు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. మెజార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రజలపై ధరల భారం, నిరుద్యోగం పెంచుతున్నాయన్నారు. మతోన్మాద రాజకీయాలకు తెలంగాణ గడ్డమీద స్థానం లేదని చాటి చెబుదామని పిలుపునిచ్చారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యవర్గసభ్యులు మండ్ల రాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి విజయరాములు, సీపీఐ (ఎంఎల్‌) మాస్‌లైన్‌ జిల్లా కార్యదర్శి హన్మంతు, సీపీఎం పట్టణ కార్యదర్శి పరమేశ్వరాచారి, సీపీఐ పట్టణ కార్యదర్శి గోపాలకృష్ణ, రమేశ్‌, గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
డిసెంబర్‌ 14న  మెగా లోక్‌ అదాలత్‌ 
1
1/1

డిసెంబర్‌ 14న మెగా లోక్‌ అదాలత్‌

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement