వనపర్తి: జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరగా ధాన్యం సేకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని నిబంధనలకు అనుగుణంగా తేమ శాతం ఉంటేనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని, ఆన్‌లైన్ నమోదు చేయాలని సూచించారు. మిల్లర్లు తీసుకున్న ధాన్యానికి సంబంధించిన రసీదు రెండురోజుల్లో తీసుకోవాలని, ఏదేని కారణంతో ధాన్యాన్ని తిరస్కరిస్తే వెంటనే సంబంధిత ఏఈఓలు వెళ్లి సమస్య పరిష్కరించాలని సూచించారు. ధాన్యం తూర్పారబట్టనికి ప్రతి కేంద్రంలో ఫ్యాన్లు, టార్పాలిన్లు, గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, మెప్మా, సహకార సంఘాలు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చూడాలని కోరారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు, డీఎస్‌ఓ విశ్వనాథ్, డీఏఓ గోవింద్‌నాయక్, డీసీఓ ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తాగునీరు, స్వచ్ఛతపై దృష్టి..
జిల్లాలో తాగునీరు, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. మంగళవారం కలెక్టరేట్‌లో తాగునీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. జిల్లాలో మరుగుదొడ్లు లేని ఇళ్లు 365 ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరుగుదొడ్డి లేని ఇల్లు ఉండొద్దని.. పేదలు స్వచ్ఛభారత్ పథకంలో ఉచితంగా మరుగుదొడ్లు నిర్మించుకునేలా చూడాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకుడు గుంతలు, అన్ని గ్రామాల్లోని మురుగు కాల్వల చివర్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలు నిర్మించాలని సూచించారు. ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని.. 50 మైక్రాన్ కంటే తక్కువ నాణ్యతతో ఉన్న ప్లాస్టిక్ సంచులను విక్రయించినా, వినియోగించినా జరిమానాలు విధించాలన్నారు. సేకరించిన తడి చెత్తతో సేంద్రియ ఎరువులు తయారు చేసేలా చర్యలు తీసుకోవాలని, ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రాల్లో సామూహిక మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. నీటి పరీక్షలు నిర్వహిస్తూ స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ ఉమాదేవి, మిషన్ భగీరథ డీఈఈ మేఘారెడ్డి, డీఏఓ గోవింద్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విజయోత్సవ కళాయాత్ర..
ప్రజాపాలన ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా జిల్లాకేంద్రంలో మంగళవారం విజయోత్సవ కళాయాత్రను కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. జిల్లాలో ఈ యాత్ర డిసెంబర్ 7 వరకు కొనసాగుతుందని.. ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరిస్తూ చైతన్యం చేస్తుందని చెప్పారు. డిసెంబర్ 6న రాష్ట్ర సాంస్కృతికశాఖ నుంచి నాగరాజు కళాబృందం జిల్లాలో భారీ కళా ప్రదర్శన నిర్వహించి విజయోత్సవ ర్యాలీని ముగించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ సీతారాం, డీపీఓ సురేశ్, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మమ్మ, ఏఓ భానుప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
విధిగా నిబంధనలు పాటించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
Comments
Please login to add a commentAdd a comment