గచ్చిబౌలికి బస్సు సౌకర్యం
వపపర్తి టౌన్: వనపర్తి నుంచి గచ్చిబౌలికి రోజు ఉదయం బస్సు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ వేణుగోపాల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 4.40 గంటలకు బస్టాండ్ నుంచి బయలుదేరి కొత్తకోట, ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా 8 గంటలకు గచ్చిబౌలికి చేరుకుంటుందని పేర్కొన్నారు. ఆదివారం ఉదయం నుంచే ప్రారంభమవుతుందని.. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
నేడు ఆర్‌ఎల్‌డీ డిగ్రీ
కళాశాల స్వర్ణోత్సవాలు
వనపర్తి విద్యావిభాగం: జిల్లాకేంద్రంలోని ఆర్‌ఎల్‌డీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్వర్ణోత్సవ వేడుకలను ఆదివారం నర్సింగాయపల్లి సమీపంలో నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్, స్వర్ణోత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు రఘునందన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల ప్రారంభం 1974 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, కళాశాలలో చదివిన విద్యార్థులు అందరిని కార్యక్రమానికి ఆహ్వానించామని పేర్కొన్నారు. కళాశాలలో విద్యాబుద్ధులు నేర్చుకున్న అందరూ కలిసి కళాశాలకు గొప్ప వైభవం తీసుకొచ్చే ఉద్దేశంతో పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఉదయం 9 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయని.. ముఖ్యఅతిథులుగా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, తెలంగాణ రెగ్యులేటరీ కమిటీ చైర్మన్ నాగార్జున, కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎస్పీ రావుల గిరిధర్, పలువురు వైస్ ఛాన్సర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.
‘ఉపాధి’ లక్ష్యాన్ని
చేరుకోవాలి
వీపనగండ్ల: ఉపాధిహామీ పథకంలో గ్రామానికి నిర్ణయించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అడిషనల్ డీఆర్డీఓ నాగేంద్రం ఆదేశించారు. శనివారం మండలంలోని సంగినేనిపల్లి, కల్వరాలలో ఎంపిక చేసిన ఉపాధి పనులపై పరిశీలన చేసిన అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో సిబ్బందితో సమావేశమయ్యారు. డిసెంబర్, జనవరిలో 10 వేల పనులు, ఫిబ్రవరి, మార్చిలో 20 వేల పనులు పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని, నిబంధనలు అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏపీఓ శేఖర్‌గౌడ్, సాంకేతిక, క్షేత్ర సహాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment