విద్యుత్‌రంగ ప్రైవేటీకరణ సరికాదు : సీఐటీయూ
వనపర్తి రూరల్: విద్యుత్‌రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, చండీగఢ్ విద్యుత్ కార్మికులపై ఎస్మా ఎత్తివేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్టా ఆంజనేయులు కోరారు. విద్యుత్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలో మంగళవారం వనపర్తి సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలోని డిస్కంలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు మొదలయ్యాయని.. దాదాపు అన్ని రాష్ట్రాల్లో స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం, పవర్‌గ్రిడ్ సబ్‌స్టేషన్లను గంపగుత్తాగా ఓట్‌సోర్సింగ్ చేయమని ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. విద్యుదుత్పత్తి, ట్రాన్స్‌మిషన్, పంపిణీ సంస్థలను కార్పొరేట్లకు అప్పగించొద్దన్నారు. విద్యుత్ చట్ట సవరణ బిల్లు–2022 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మూడోసారి ఏర్పడిన మోదీ ప్రభుత్వం గతంలో కన్నా మరింత దూకుడుగా ప్రజా వ్యతిరేక, వినాశకర విధానాలను అవలంబిస్తోందని చెప్పారు. విద్యుత్‌రంగ పరిరక్షణకు పోరాడుతున్న కార్మికులు, ఇంజినీర్లకు మద్దతుగా నిలబడాలని, దేశవ్యాప్తంగా సంఘీభావం ప్రకటించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు నందిమళ్ల రాములు, సాయిలు, గిరిబాబు, రాములు ,రాంచందర్, రామకృష్ణ, బాలస్వామి, కడుకుంట్ల రాములు, నాగశేషు, రమేష్ ,నాగన్న, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment