బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ
వనపర్తి టౌన్: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ కోరారు. గురువారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ నమోదు, మండల అధ్యక్ష ఎన్నికపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బూత్ కమిటీలు, మండల, జిల్లా, రాష్ట్ర నాయకుల సమన్వయంతో కార్యకర్తలు ముందుకు సాగడంతో క్రియాశీల సభ్యత్వ నమోదులో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. ఇదే ఉత్సాహంతో రాబోయే స్థానిక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్‌పార్టీ వైఫల్యాలను ఎండగట్టి ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి గురించి ఇంటింటికి వివరించి అధికార పార్టీ దిమ్మ తిరిగేలా బీజేపీ జెండా ఎగురవేయాలన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో మోదీకి మద్దతుగా నిలిచిన 63 వేల మంది ఓటర్లను మరొక్కమారు కలిసి స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, సర్పంచుల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.పురుషోత్తంరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి, వనపర్తి మండల ఇన్‌చార్జ్ పెద్దిరాజు, వనపర్తి మండల పరిశీలకుడు, జిల్లా కార్యదర్శి రాము, జిల్లా కార్యవర్గసభ్యుడు బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment