గడువులోగా సీఎంఆర్ అప్పగించాలి
వనపర్తి: జిల్లాలోని రైస్‌మిల్లర్లు 2023–24 యాసంగి, 2024–25 వానాకాలం సీజన్లకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన సీఎంఆర్ వెంటనే అప్పగించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రైస్‌మిల్లర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2023–24 యాసంగి సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్‌ను ఈ నెల 25లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా 2024–25 వానాకాలానికి సంబంధించి పౌరసరఫరాలశాఖకు ఇవ్వాల్సిన ధాన్యం కూడా వెంటనే అందించాలని.. నిర్దేశిత గడువులోగా అప్పగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చాలామంది మిల్లర్లు ఎంత చెప్పినా బ్యాంకు గ్యారంటీలు ఇవ్వడం లేదని.. అదే ధోరణి కొనసాగితే ధాన్యాన్ని ఇతర మిల్లులకు తరలించేందుకు కూడా వెనుకాడబోమన్నారు. నిర్లక్ష్య ధోరణి వీడి సీఎంఆర్ అప్పగించి చట్టపరమైన చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథ్, సివిల్ సప్లయ్ డీఎం రమేష్, రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు
Comments
Please login to add a commentAdd a comment