దారి తప్పుతున్న యువత
జల్సాల కోసం చోరీలు
● ఈజీ మనీ కోసం దొంగలుగా మారుతున్న వైనం
● నిందితుల్లో ఇంజినీరింగ్ చదివిన మహిళ, 30 ఏళ్లలోపు యువకులు
● సైబర్ నేరంలోనూ రూ.2 కోట్ల మేర మోసం
● జిల్లాలో ఒకేరోజు 17
మంది నిందితుల రిమాండ్
● విస్తుపోయే వివరాలు వెల్లడించిన ఎస్పీ రావుల గిరిధర్
యూట్యూబ్‌లో చూసి..
గతేడాది డిసెంబర్ నెలాఖరున వరుస సెలవులు రావడంతో అమరచింతలోని యూనియన్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన వారికి నాయకత్వం వహించింది ఇంజినీరింగ్ చదువుకున్న ఓ మహిళ. ఈజీ మనీ కోసం బ్యాంకు రాబరీ చేసేందుకు యూట్యూబ్‌లో కొన్ని వీడియోలను చూసి సొంత ప్రణాళికతో ఇంటి నిర్మాణం కోసం తెచ్చుకున్న గడ్డపార, ఇతరత్రా ఇనుప వస్తువులతో చుట్టుపక్కల ఉండే మరికొందరు యువకులను సిద్ధం చేసి బ్యాంకును లూటీ చేసేందుకు విఫలయత్నం చేసింది. పలుమార్లు రెక్కీ నిర్వహించడం, బ్యాంకు చుట్టూ అనుమానాస్పదంగా తిరగడం వంటి దృశ్యాలను ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు.. లోతుగా విచారణ చేయగా.. నేరం చేసేందుకు ప్రయత్నించినట్లు సదరు మహిళ నాయకత్వంలో విఫలయత్నం చేసిన బృందం ఒప్పుకుంది. దీంతో వారి నుంచి బ్యాంకు గ్రిల్స్‌ను పగులగొట్టేందుకు ఉపయోగించిన గడ్డపార, ఇనుప వస్తువులు, బ్యాంకులోని సీసీ కెమెరా పుటేజీ స్టోరేజీ అయిన ఎలక్ట్రానిక్ పరికరం (డీవీఆర్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వనపర్తి: ఉన్నత చదువులు చదివి.. బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకుంటూ.. పుట్టిన ఊరుకు, కన్నవారికి పేరు, ప్రఖ్యాతులు తీసుకురావాల్సిన యువత వారు. కానీ, జల్సాలకు అలవాటుపడి పెడదారి పట్టారు.. ఈ క్రమంలో ఈజీ మనీ కోసం దొంగల అవతారమెత్తి.. చివరికి కటకటాల పాలవుతున్నారు. వీరిలో అందరూ 30 ఏళ్లలోపు యువత, ఇంజినీరింగ్ చదివిన ఓ మహిళ ఉండటం విశేషం. వనపర్తి జిల్లా పోలీసులు పట్టుకున్న దొంగలను, ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించిన విస్తుపోయే వివరాలను గమనిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది.
● గోపాల్‌పేటలోని రెండు ఇళ్లలో, బుద్దారంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను అపహరించిన కేసుల్లో నిందితులు 30 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం.
● ఆత్మకూరు పీఎస్ పరిధిలో ఓ యువకుడు సులభంగా డబ్బు సంపాదించాలని ఆలయాల్లో కంచు గంటలు అపహరించేందుకు అలవాటు పడ్డాడు.
● మరో ఇద్దరు యువకులు ఇదే పీఎస్ పరిధిలో కూరగాయలు విక్రయించేవారు.. కాయకష్టం చేసుకునే వారిని దూరపు బంధువులుగా నమ్మిస్తారు. వారికి కల్లు తాగించి మత్తులోకి వెళ్లాక వారి ఇంటిలో, ఒంటిపై ఉన్న బంగారం, నగదు చోరీ చేశారు. ఈ మూడు చోరీలకు పాల్పడిన నిందితుడు గోపాల్‌పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన 25 ఏళ్ల అశోక్‌గా పోలీసులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment