పరిశ్రమల స్థాపనకు వేగంగా అనుమతులు
వనపర్తి: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అన్ని అనుమతులను వేగంగా జారీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. సోమవారం కలెక్టర్‌రేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 6 ఎస్సీ, 9 ఎస్టీ యూనిట్లకు ఇన్‌వెస్ట్‌మెంట్ సబ్సిడీని మంజూరు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన డిస్ట్రిక్ట్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్) కార్యక్రమం కింద జిల్లాలోని నిరుద్యోగ యువతీ, యువకులను భాగస్వామ్యం చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే జిల్లాలోని పరిశ్రమలను సైతం నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంపై యువతకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలన్నారు. జిల్లా నుంచి ఎగుమతి చేసే ఉత్పత్తుల కార్యాచరణను ఆమోదించడం జరిగిందన్నారు. అలాగే పీఎం ఇంటర్న్ షిప్ స్కీం కింద 20, 21 ఏళ్ల వయసున్న, చదువు పూర్తయిన విద్యార్థులను ఇందులో భాగస్వామ్యం చేసేలా ఉన్నత విద్యాశాఖ, ఐటీఐ కళాశాల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం దరఖాస్తులను త్వరగా క్లియర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, పరిశ్రమల శాఖ జీఎం రఘునాథ్, ఏజీఎం నాగేష్, డీఆర్‌డీఓ ఉమాదేవి, బీసీ సంక్షేమ అధికారి సుబ్బారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ ఈడీ మల్లికార్జున్ పాల్గొన్నారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
వనపర్తి: ప్రతిఒక్కరూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జనవరి నెలను జాతీయ రోడ్డు భద్రత మాసంగా ప్రకటించిన నేపథ్యంలో, ప్రతిరోజు రోడ్డు భద్రతపై విభిన్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. బుధవారం రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు కలెక్టరేట్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ర్యాలీలో ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించి పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment