వ్యాపారుల దోపిడీని అరికట్టాలి
వనపర్తి రూరల్: ఆరుగాలం కష్టపడి వేరుశనగ పండించిన రైతులు.. ఉత్పత్తులు అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. మద్దతు ధర లభిస్తుందనే ఆశతో మార్కెట్ యార్డుకు వేరుశనగ తీసుకొచ్చిన రైతులు.. చివరికి తమకు న్యాయం చేయాలని రోడ్డెక్కాల్సిన పరిస్థితి దాపురించింది. సోమవారం మండలంలోని చిట్యాల శివారు వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చిన వేరుశనగకు వ్యాపారులు ఉదయం నుంచి టెండర్ వేయకపోవడంతో రైతులు ఆందోళనకు గురై రోడ్డుపైకి వచ్చి బైటాయించి ఆందోళన చేపట్టారు. రైతులకు మద్దతుగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌రెడ్డి, కార్యదర్శి పరమేశ్వరచారి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వ్యవసాయ మార్కెట్లలో వేరుశనగను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటే.. ఇక్కడ మాత్రం వ్యాపారులు కుమ్మకై ్క నాణ్యత సాకు చూపి తక్కువ ధర చెల్లిస్తున్నారని ఆరోపించారు. రైతులు రూ.వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంట పండిస్తే.. ఇప్పుడేమో క్వింటాల్ రూ.3 వేల నుంచి రూ.6,500 మాత్రమే కొనుగోలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. వ్యవసాయ మార్కెట్లో వ్యాపారుల దోపిడీని అరికట్టాలన్నారు. వ్యాపారుల కమీషన్ రూ.3.50 నుంచి రూ.1.75 తగ్గించాలని డిమాండ్ చేశారు. రైతులు ఐదు నెలలు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక నష్టపోతున్నామన్నారు. పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యాపారులతో అధిక వడ్డీలకు అప్పులు తీసుకొని పంటలు వేశామని, తీరా పంట చేతికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేక, తెచ్చిన అప్పులు తీరక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు స్పందించి వేరుశనగ క్వింటాల్‌కు రూ.10 వేలు మద్దతు ధర చెల్లించాలన్నారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌గౌడ్ రైతులతో చర్చలు జరిపి మద్దతు ధర వచ్చేలా వ్యాపారులతో మాట్లాడుతామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో జంపయ్యయాదవ్, సిద్ధయ్య, కుర్మయ్య, చిన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.
మద్దతు ధర కల్పించాలని
రోడ్డెక్కిన వేరుశనగ రైతులు
Comments
Please login to add a commentAdd a comment