కల్యాణలక్ష్మి పేదలకు వరం
కొత్తకోట రూరల్: కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదలకు వరమని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్న ప్రొ. జయశంకర్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. రాష్ట్రంలోని అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి, రూ.500కే సిలిండర్, రూ.2 లక్షల పంట రుణమాఫీ అమలుచేసి చూపించిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రతిపక్ష నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం విలియంకొండలో గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్‌కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, సీడీసీ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, బోయేజ్, పి.కృష్ణారెడ్డి, వేముల శ్రీనివాస్‌రెడ్డి, డా. పీజే బాబు, మేసీ్త్ర శ్రీనివాసులు, బీచుపల్లియాదవ్, ఎల్లంపల్లి నరేందర్‌రెడ్డి, పెంటన్నయాదవ్, సంద వెంకటేశ్, సలీంఖాన్, మోహన్‌రెడ్డి, ముజీబ్, మాజీ సర్పంచ్ విశ్వనాథం పాల్గొన్నారు.
ఫిబ్రవరి 5న
దేశవ్యాప్త నిరసనలు
వనపర్తి రూరల్: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలంటూ ఫిబ్రవరి 5న దేశవ్యాప్తంగా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో యావత్ కార్మిక వర్గం పాల్గొనాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రాష్ట్ర కార్యదర్శి సురేష్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కార్మికులతో కలిసి మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్(ఏఐటీయూసీ) రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. బ్రిటీష్ కాలం నుంచి నేటి వరకు కార్మిక సంఘాలు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగు కోడ్లుగా విభజించి 44 కార్మిక చట్టాలను రద్దు చేసిందని మండిపడ్డారు. దీంతో కార్మికులు అనేక సంక్షేమాలకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రతి ఐదేళ్లకు ఓసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు సవరణ చేయాల్సి ఉండగా.. అందుకు విరుద్ధంగా కనీస వేతనాలను కుదించే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య,సెక్యూరిటీ, పేషెంట్‌కేర్ సూపర్‌వైజర్లను క్రమబద్ధీకరించి రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు గంజి శ్రీను, నర్సింహ, దర్గాస్వామి, కుమార్, ఆంజనేయులు, శ్రీకాంత్, శివ, మహేందర్, ప్రవీణ్, భాను, అనిల్ పాల్గొన్నారు.
ఆర్టిజన్ కార్మికుల
రిలే దీక్షలు
వనపర్తి రూరల్: విద్యుత్‌శాఖలో 20 వేల మంది ఆర్టిజన్ కార్మికులు పనిచేస్తున్నారని.. వారి అర్హతల ఆధారంగా మార్పిడి చేయాలంటూ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా రిలే దీక్షలు ప్రారంభించారని టీవీఏసీ జేఏసీ నాయకుడు ఆనంద్‌గౌడ్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని సర్కిల్ కార్యాలయం ఎదుట శిబిరం ఏర్పాటుచేసి టీవీఏసీ జేఏసీ నాయకులు ఆనంద్‌గౌడ్, రామ్, రమణ, నరహరి, అశోక్ దీక్షలో పాల్గొన్నారు. వీరికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ (టీజీయూఈఈయూ), సీఐటీయూ జిల్లా నాయకుడు రామకృష్ణ వారికి పూలమాలలు వేసి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్టీజన్ కార్మికులు స్కిల్డ్ వర్క్ విధానంలో సుమారు 20 ఏళ్లుగా పనిచేస్తున్నారని.. క్రమబద్దీకరించాలని కోరారు.
6,614 క్వింటాళ్ల వేరుశనగ రాక
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం 6,614 క్వింటాళ్ల వేరుశనగ విక్రయానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ.6,569, కనిష్టంగా రూ.4,029 ధర పలికింది. అలాగే కంది రూ.7,159– రూ.5,800, మొక్కజొన్న క్వింటా రూ.2,431, బెబ్బర్లు క్వింటా రూ.6,683, వరి ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,590, కనిష్టంగా రూ.2,409, జొన్న క్వింటా రూ.4,143 ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment