రేషన్‌కార్డులకే అధికం | - | Sakshi
Sakshi News home page

రేషన్‌కార్డులకే అధికం

Published Wed, Jan 22 2025 1:11 AM | Last Updated on Wed, Jan 22 2025 1:10 AM

రేషన్

రేషన్‌కార్డులకే అధికం

తొలిరోజు జిల్లాలో 137 గ్రామ, వార్డుసభలు

కొరబడిన ప్రచారం..

మంగళవారం గ్రామసభలు జరిగే గ్రామాలు, పుర వార్డుల్లో అధికారులు టాంటాం వేయించడంతో పాటు ఆయా గ్రామాలు, వార్డుల సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయాల్సి ఉంది. కాని కొన్ని మండలాలు, పురపాలికల్లో ప్రచారం చేయకపోవడంతో ప్రజాస్పందన ఆశించిన మేర లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. నేటి సభల నిర్వహణతో గ్రామాలు, మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున ప్రచారం సాగింది. దీంతో ఇకనుంచి ప్రజాస్పందన పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

4,749 దరఖాస్తులు..

తొలిరోజు గ్రామసభల్లో కొత్త రేషన్‌ కార్డుల కోసం భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఇదివరకే అధికారులు సిద్ధం చేసిన జాబితాతో పాటు 137 గ్రామ, వార్డు సభల్లో 4,749 దరఖాస్తులు రావడం గమనార్హం.

వనపర్తి/వనపర్తి టౌన్‌: ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా గణతంత్ర దినోత్సవం రోజున ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్‌ కార్డుల పంపిణీని అమలు చేయాలని కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు గ్రా మాల్లో నిర్వహించిన క్షేత్రస్థాయి సర్వే అనంతరం మంగళవారం నుంచి గ్రామసభల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. తొలిరోజు జరిగిన గ్రామ, వార్డు సభలకు ప్రజలు, వివిధ పక్షాల నాయకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. జిల్లాకేంద్రంలోని 8, 12 పుర వార్డులతో పాటు మంత్రి జూపల్లి నియోజకవర్గం పానగల్‌ మండలం అన్నారం గ్రామంలో జరిగిన గ్రామసభల్లో లబ్ధిదారుల జాబితా చదువుతుండగా అర్హులైన వారికి ఆయా పథకాలు వర్తించలేదంటూ గ్రామసభను బహిష్కరించారు. ఖిల్లాఘనపురం మండలం మానాజీపేటలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో పారదర్శకత లేదని, అర్హులైన చాలామందికి ఇందిరమ్మ ఇళ్లు దక్కలేదని, ఎవరి సూచన మేరకు జాబితా తయారు చేశారని కొందరు అధికార పార్టీ నాయకులు అసహనం వ్యక్తం చేస్తూ అధికారులపై మండిపడ్డారు. అర్హులైన వారి పేర్లు జాబితాలో చేర్చేందుకు కొత్తగా దరఖాస్తులు ఇవ్వాలని అధికారులు చెప్పడంతో శాంతించారు.

అధికార పార్టీ కౌన్సిలర్‌ అసహనం..

జిల్లాకేంద్రంలోని 8వ వార్డులో జరిగిన సభలో అర్హులైన చాలామందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాలేదని ఆ వార్డు కౌన్సిలర్‌ విభూది నారాయణ అసహనం వ్యక్తం చేశారు. అధికారులు చేసిన సర్వేలో లోపాలు ఉన్నాయంటూ మండిపడ్డారు. అర్హులకు అన్యాయం జరిగిందంటూ మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్లు సైతం అధికారులపై విమర్శలు గుప్పించారు. సర్వేలో తమను భాగస్వాములను చేయకపోవడంతో చాలాచోట్ల పొరపాట్లు జరిగాయని మున్సిపల్‌ కమిషనర్‌ ఎదుటనే అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులను సంప్రదిస్తామని చెప్పారు.

మంత్రి ఇలాఖా అన్నారంలో గ్రామసభ బహిష్కరణ

గ్రామసభల నిర్వహణపై పలు ప్రాంతాల్లో టాంటాం వేయించని వైనం

జిల్లాకేంద్రంలో అధికారపార్టీ వర్గాల మధ్య వాగ్వాదం

మరో అధికార పార్టీ కౌన్సిలర్‌ అధికారులపై మండిపాటు

నాలాంటి పేదలకు అర్హత కల్పించరా?

సొంత ఇల్లు, భూమి లేని నాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయలేదు. సర్వేకు గ్రామానికి వచ్చిన అధికారులకు సైతం నా పరిస్థితిని వివరించా. నాలాంటి పేదలకు ఇల్లు మంజూరు చేయకపోవడం సరికాదు. గ్రామసభలో అధికారులను నిలదీస్తే సమాధానం చెప్పలేదు.

– బీసమ్మ, అన్నారం, పానగల్‌ మండలం

అధికారపార్టీ వర్గాల మధ్య వాగ్వాదం..

జిల్లాకేంద్రంలోని 12వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఎమ్మెల్యే మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అధికారుల ఎదుటే వాదోపవాదాలు జరిగాయి. సభ నిర్వహణపై తమకు సమాచారం ఎందుకు ఇవ్వలేదంటూ చిన్నారెడ్డి వర్గీయులు అధికారులను ప్రశ్నించారు. ఇరువర్గాలు అధికార పార్టీకి చెందినవే కావడంతో అధికారులు ఎవరికీ సర్ది చెప్పలేక తలలు పట్టుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
రేషన్‌కార్డులకే అధికం 1
1/1

రేషన్‌కార్డులకే అధికం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement