మహిళామణులు
● ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుంటున్న అతివలు
● అధునాతన హంగులతో మహిళాశక్తి క్యాంటీన్స్ ఏర్పాటు
● రోజుకు రూ. 4వేల నుంచి రూ. 5వేల వరకు సంపాదన
వారంతా స్వయం సహాయక మహిళా సంఘాల్లోని సభ్యులు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన పెంచుకున్నారు. ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ, సీ్త్రనిధి ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే వారి ఆకాంక్షకు ప్రభుత్వం అండగా నిలిచింది. వారి ఆసక్తి మేరకు మహిళాశక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయించింది. ప్రభుత్వ సహకారం.. స్వయం కృషితో వారు ఆర్థిక బలోపేతం దిశగా పయనిస్తున్నారు. అధునాతన హంగులతో మహిళాశక్తి క్యాంటీన్లు నిర్వహిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
– జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్)/గద్వాలన్యూటౌన్/మదనాపురం
మహబూబ్‌నగర్ సమీకృత కలెక్టరేట్ డైనింగ్ హాల్‌లో హన్వాడ మండలం యారోనిపల్లి గ్రామైక్య సంఘం సభ్యులు మహిళాశక్తి క్యాంటీన్ ఏర్పాటు చేయగా.. 2024 జూలై 9న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. క్యాంటీన్ నిర్వహణకు కలెక్టర్ విజయేందిర పూర్తి సహకారం అందించారు. యారోనిపల్లి గ్రామైక్య సంఘం కార్యదర్శి మైబమ్మ, కోశాధికారి రాధమ్మ, సభ్యులు రాఘ, భారతమ్మ, మంగమ్మ, పుష్పమ్మలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. రోజు రూ. 20వేల వరకు వస్తుండగా.. రూ. 15వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చులు పోను రూ. 4వేల నుంచి రూ. 5వేల వరకు సంపాదిస్తున్నారు. క్యాంటిన్‌తో తాము ఆర్థికంగా నిలదొక్కుకుంటూనే.. మరో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ప్రతినెలా చివరి రోజు నెల రోజుల్లో వచ్చిన మొత్తాన్ని లెక్క చేసుకుని పంచుకుంటామని తెలిపారు.
జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని బోంకూరు గ్రామానికి చెందిన ఖాసీంబీ స్వయం ఉపాధిలో రాణిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఖాసీంబీ ఆదర్శ మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరింది. ఆమె భర్త రసూల్ అప్పటికే చిన్నపాటిగా పాలకోవ వ్యాపారం చేసేవాడు. ఖాసీంబీకి బ్యాంకు ద్వారా అందిన రుణంతో పాలకోవ వ్యాపారంలో పాలుపంచుకుంది. పాలకోవకు కావాల్సిన పాలు, చక్కెర తదితర ముడిపదార్థాలతో నాణ్యమైన పాలకోవను తయారు చేసి ఇంటి వద్దే విక్రయించడం ప్రారంభించింది. రుచికరంగా, నాణ్యమైనదిగా ఉండటంతో రోజురోజుకు అమ్మకం పెరిగింది. ఇంటి వద్దే కాకుండా భర్త సహకారంతో కర్నూల్ కలెక్టరేట్‌లోనూ పాలకోవ విక్రయిస్తున్నారు. రోజు 50 కిలోల పాలకోవను తయారుచేస్తూ.. ఖర్చులు పోను రూ. 7వేల నుంచి రూ.8వేల వరకు సంపాదిస్తున్నారు.
పాలకోవను ప్యాకింగ్ చేస్తున్న ఖాసీంబీ
Comments
Please login to add a commentAdd a comment