సేంద్రియ సాగుపై పట్టు
జడ్చర్ల టౌన్: పర్యావరణ హితంతో పాటు ఆరోగ్యాలను కాపాడే విధంగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు మిడ్జిల్ మండలంలోని అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన తెలకపల్లి లక్ష్మణ శర్మ కుటుంబం. దశాబ్దకాలంగా పూర్తిగా పురుగు మందులు వాడకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నారు. వారికి ఉన్న 10 ఎకరాలతో పాటు బంధువులకు చెందిన 30 ఎకరాలు సైతం కౌలుకు తీసుకుని మొత్తం 40 ఎకరాలు ఇదే పద్ధతిలో సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా 15 ఎకరాల్లో వరిపంట సాగుచేస్తుండగా.. మిగిలిన భూమిలో కూరగాయలు, మిర్చి సాగు చేస్తున్నారు. సుభాష్ పాలేకర్ స్ఫూర్తిగా వారు సేంద్రియ సాగు వైపు మొగ్గు చూపారు. సొంతంగా పంటలకు అవసరమైన వర్మీ కంపోస్టుతో పాటు జీవామృతం, గణ జీవామృతం తయారు చేసుకుంటున్నారు. పండిన పంటలను మహబూబ్‌నగర్‌లోని కొన్ని సూపర్ మార్కెట్లు, హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. సాధారణ వ్యవసాయంలో ఎకరాకు 40 బస్తాల వరకు దిగుబడి రాగా సేంద్రియ పద్ధతిలో 25–30 బస్తాల దిగుబడి వస్తుంది. అలాగే ఈ పద్ధతికి శ్రమ కూడా అధికమే. కానీ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొనే ఎన్ని కష్టాలు ఎదురైనా సేంద్రియ పద్ధతిలోనే ముందుకు సాగుతున్నారు. లక్ష్మణశర్మ కుమారుడు సాకేత్‌రాం హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి ఆరేళ్లుగా తండ్రితో కలిసి సహజ వ్యవసాయం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆర్గానిక్ వ్యవసాయంలో లక్ష్మణశర్మ భార్య జానకమ్మ, కుమారుడు సాకేత్‌రామ్, కోడలు శ్వేతలు పూర్తిగా నిమగ్నమయ్యారు. దీంతో పాటు గానుగ నూనెలు
తయారు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment