సంక్షేమ పండగ ఘనంగా ప్రారంభిస్తాం
వనపర్తి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న నాలుగు సంక్షేమ పథకాలను జిల్లాలో గణతంత్ర దినోత్సవం రోజున పండగ వాతావరణంలో ఘనంగా ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెనన్స్‌లో కలెక్టర్ పాల్గొని జిల్లా వివరాలు వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని ప్రతి మండలంలోని ఒక గ్రామంలో జనవరి 26న మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభిస్తామని వివరించారు. నాలుగు పథకాలకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశామని.. కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, ప్రజలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమ నిర్వహణకు ఆయా మండలాల ప్రత్యేక అధికారులు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు. వీసీలో అదనపు కలెక్టర్లు సంచిత్ గంగ్వార్, జి.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ సుబ్రమణ్యం, జెడ్పీ సీఈఓ యాదయ్య, డీఆర్డీఓ ఉమాదేవి పాల్గొన్నారు.
ఓటు హక్కు వజ్రాయుధం
వనపర్తి: ఉత్తమ సమాజాన్ని నిర్మించడానికి ఓటు హక్కు సామాన్యులకు వజ్రాయుధంలాంటిదని.. అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు ఎన్నికల్లో వినియోగించుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి కోరారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో 15వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మర్రికుంటలోని గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఐడీఓసీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పేద, ధనిక, కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి భారతీయ ఎన్నికల కమిషన్ ఓటు హక్కు కల్పిస్తుందని చెప్పారు. జిల్లాలో 2.80 లక్షల ఓటర్లుండగా.. అందులో 50 శాతానికిపైగా మహిళా ఓటర్లు ఉన్నారన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం జనవరి 25న ఏర్పడినందున ఈ రోజును జాతీయ ఓటరు దినోత్సవంగా జరుపుకొంటున్నామని తెలిపారు. ఓటరు నమోదుకు ఏటా రెండుసార్లు ప్రత్యేక రివిజన్ కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. విలేజ్ ఇన్ పార్ట్‌నర్‌షిప్ సంస్థ ప్రతినిధి నాగేంద్రస్వామి, ట్రాన్స్‌జెండర్ రమ్యారెడ్డి, ఆర్డీఏ అధ్యక్షురాలు చిన్నమ్మ థామస్, విద్యార్థులు కూడా మాట్లాడారు. అనంతరం ఓటు ప్రతిజ్ఞ చేయించారు. శాసనసభ, లోక్‌సభ ఎన్నికల్లో బాగా పనిచేసిన ఏఆర్‌ఓలు, ఇతర సిబ్బందికి అదనపు కలెక్టర్లు ప్రశంసాపత్రాలతో పాటు జ్ఞాపికలు అందజేశారు. ఆర్డీఓ సుబ్రమణ్యం, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment