రోడ్డు భద్రతతో ప్రమాదాల నివారణ
వనపర్తి: నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారినపడి కుటుంబ సభ్యులను కష్టాలపాలు చేయొద్దని జిల్లా రవాణాశాఖ అధికారి మానస సూచించారు. రాష్ట్ర రోడ్డు రవాణాశాఖ, పోలీస్‌శాఖ సంయుక్తంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రోజుకో కార్యక్రమం చొప్పున నెలరోజుల పాటు ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. శుక్రవారం ముగింపు రోజున జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానం నుంచి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వరకు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. వాహన చోదకులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్టు ధరించాలని సూచించారు. సరైన ధ్రువపత్రాలు లేకుండా, మద్యం తాగి వాహనాలు నడిపితే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐ ఎం.కృష్ణ రూరల్ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి, ట్రాఫిక్ ఎస్‌ఐ సురేంద్ర, వెహికల్ ఇన్‌స్పెక్టర్ సైదులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment