ఎల్కతుర్తి మండలం పెంచికల పేట నుంచి హసన్‌పర్తి వరకు నత్తనడకన సాగుతున్న ఎన్‌హెచ్–563 ఫోర్‌లేన్ పనులు
నత్తనడకన వరంగల్ టు కరీంనగర్ ఎన్‌హెచ్ 563 పనులు..
జూలై 2025 నాటికి పూర్తి గగనమే..
రూ.2,146.86 కోట్లతో హైవే పనులు
నగరం సమీపంలో వెరీ స్లో.. సబ్ కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల ఆలస్యం
నెమ్మదిగా బైపాస్ రోడ్డు, డివైడర్లు, వంతెనల నిర్మాణాలు
సాక్షిప్రతినిధి, వరంగల్: వరంగల్ నుంచి కరీంనగర్ ఇరుకై న రెండు వరుసల రహదారి గుంతలమయం కావడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ తర్వాత రెండు ముఖ్య నగరాలైన వరంగల్ – కరీంనగర్ మధ్య రద్దీ రాకపోకలు పెరగడంతో ఇప్పుడున్న రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నాలుగేళ్ల కిందటే దీన్ని నాలుగు వరుసలుగా విస్తరించాలనుకున్నారు. నిధుల లేమితో ఆలస్యం కాగా.. భారత్ మాలా పరియోజన్ కింద 2022లో రూ.2,146 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచి పనులు అప్పగించారు. సుమారు 68 కిలోమీటర్ల విస్తీ ర్ణం గల ఈ రోడ్డును 2025 జూలైలో పూర్తి చేయాలని 2023 ఫిబ్రవరిలో కాంట్రాక్టు సంస్థ అగ్రిమెంట్ చేసుకోగా.. విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. అధికారులను అడిగితే సబ్ కాంట్రాక్టర్ల వ్యవస్థ కారణం వల్ల కొంత ఆలస్యమవుతుందని చెబుతుండగా.. ఇలాగైతే 2025 జూలై వరకు పూర్తవడం కష్టమేనన్న అభిప్రాయాలను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు.
మరో ఎనిమిది నెలలే గడువు..
వరంగల్ – కరీంనగర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్–563) విస్తరణ పనులు పూర్తి చేయడానికి ఎనిమిది నెలలే గడువు ఉంది. ప్రధానంగా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట నుంచి హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్ మధ్యన ఆగుతూ.. సాగుతూ ముందుకెళ్తున్న పనుల్లో మరింత వేగం పెరగాల్సి న అవసరముంది. ఈ హైవే కోసం కోసం 305.47 హెక్టార్ల భూమి అవసరం రాగా, దాదాపుగా 258 హెక్టార్లను సేకరించడంతోపాటు 47.14 హెక్టార్ల ప్రభుత్వ ఆధీనంలోని భూమిని దారి విస్తరణకు ఉపయోగించుకుంటున్నారు. దాదాపు 30 గ్రామాల ప్రజలకు.. పలు జిల్లాల ప్రయాణికులకు ఈ మార్గం సరికొత్త వసతులతో ఉపయోగకరంగా ఉండనుంది. కరీంనగర్ జిల్లాలో 46.245 కి.మీ.ల మేర కొత్తదారి నిర్మితమవుతుండగా.. హనుమకొండ జిల్లాలో 21.770కి.మీ.లు ఉంది. ఇప్పటి వరకు కేవలం 51 శాతం పనులే జరిగాయి. పనులను విభజించి అక్కడక్కడ చేపడుతుండటంతో రాత్రివేళ వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా పనులు పూర్తి కాకపోవడంతో పొలాల మధ్య నుంచి రోడ్డును వేస్తున్న ప్రాంతాల్లో రైతులకు అగచాట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ మార్గాన్ని పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
ఈ పనుల్లో వేగం పెరగాలి
వరంగల్ – కరీంనగర్‌ల మధ్యన ఈ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పలుచోట్ల మురుగు, వరదనీటి వ్యవస్థతోపాటు నడక మార్గాన్ని 53 కి.మీ.ల మేర ఏర్పాటు చేస్తున్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు, తాడికల్, హుజూరాబాద్ బైపాస్‌లు సుమారు 31 కిలోమీటర్లు కాగా, హనుమకొండ జిల్లాలో ఎల్కతుర్తి బైపాస్ 4.600 కి.మీ.లు, హసన్‌పర్తి బైపాస్ 9.575 కి.మీ.లు ఉంది.
రహదారి విస్తరణలో భాగంగా సరిహద్దు గోడలతోపాటు చిన్నపాటి ప్రహరీలను 13.16 కి.మీ.ల దూరం ఏర్పాటు చేయాలి.
ఒక ఆర్వోబీ (రోడ్డు ఓవర్ బ్రిడ్జి), ఒక ఆర్‌యూబీ (రోడ్డు అండర్ బ్రిడ్జి) నిర్మాణం జరుగుతోంది.
మొత్తంగా ఈ మార్గంలో 6 పెద్దవి, 20 చిన్న వంతెనలు నిర్మించాలి. సగం వరకు మాత్రమే అయ్యాయి.
బాక్స్ బ్రిడ్జిలు 112 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉండగా 83 వరకు పూర్తయ్యాయి.
రోడ్డెంట పోవాలంటే భయమేస్తుంది..
వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతుండడంతో రోడ్డు క్రాస్ చేయాలంటేనే భయం అవుతోంది. ఫోర్‌లేన్ రహదారి పనులు నత్తనడకన సాగుతుండడంతో రాత్రిపూట ఎల్కతుర్తి మండల కేంద్రంలో రోడ్డు క్రాస్ చేయలేని పరిస్థితి ఎదురవుతోంది. ఇప్పటికే పలు రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది వాహనదారులు గాయాలపాలైన సంఘటనలు ఉన్నాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి ఇబ్బందులను తొలగించాలి. – ఎస్.కిరణ్, వాహనదారుడు, ఎల్కతుర్తి
Comments
Please login to add a commentAdd a comment