వైభవంగా మల్లన్న దృష్టి కుంభం
● తొలి ఘట్టం ఆరంభం
● మొదలైన ఆర్జిత సేవలు, దర్శనాలు
ఐనవోలు: ఐలోని మల్లన్న జాతర ఉత్సవాలకు ముందు ఏటా ఆనవాయితీగా నిర్వహించే దృష్టి కుంభం సోమవారం తెల్లవారుఝామున అత్యంత వైభవంగా జరిగింది. గర్భాలయంలో కొలువైన మూలవరులు స్వామి మల్లికార్జునుడు, అమ్మవార్లు గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మకు ఈనెల 10 నుంచి 15 వరకు ఆరు రోజుల పాటు సుధావళి వర్ణ లేపనం (కలర్స్ వేయడం) పనులు పూర్తి చేశారు. శాస్త్రం నిర్దేశించినట్లుగా స్వామి, అమ్మవార్ల నేత్రాలను మైనంతో కప్పి ఉంచారు. సోమవారం వేకువజామున ప్రధాన ఆలయం చుట్టూ బండారి, కుంకుమ చల్లుకుంటూ గుమ్మడి, నిమ్మకాయలతో బలిహరణగావించారు. అర్చకులు ఆలయం చుట్టూ వేద మంత్రాలు పఠిస్తూ.. మూడుసార్లు ప్రదక్షిణ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రోన్మీలన(నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించడం) గావించిగా.. శైవాగమం ప్రకారం వేద మంత్రాలతో దృష్టికుంభాన్ని అర్చకులు, వేద పండితులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సంప్రోక్షణ చేసి మూలవరులకు అలంకరణ చేశారు. గర్భాలయంలోని అర్ధప్రాణవట్టానికి పంచామృతాలతో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసి మిగిలిన తంతును పూర్తి చేశారు. అనంతరం ఆరు రోజుల పాటు నిలిచిన ఆర్జిత సేవలు, దైవదర్శనాలను ఆలయ అధికారులు తిరిగి పునరుద్ధరించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. సోమవారం ఉదయం 6.44 గంటలకు సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించిన సందర్భంగా ఆలయంలో ధనుః సంక్రమణ పూజలు చేశారు. ఇందులో భాగంగా రుద్రాభిషేకం, రుద్రహోమం, ఒగ్గు పూజారులతొ పెద్ద పట్నం నిర్వహించారు.
దృష్టికుంభం జరిగిందిలా..
గర్భగుడికి ఎదురుగా మహా మండపంలో ఒక పాత్రలో మూడు క్వింటాళ్ల అన్నాన్ని కుంభాకారంలో రాశిగా పోశారు. చుట్టూ పూలతో అలంకరించి అన్నపు రాశిపై కుంకుమ పోసి జ్యోతులు వెలిగించి కూష్మాండ బలి చేశారు. అద్దం, మేకను కూడా ఏర్పాటు చేశారు. భక్తుల జయ జయ ద్వానాలు, వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ ప్రధాన ఆలయ తలుపులూ తెరుస్తూ ఉండగా.. మూలవరులకు రంగులు అద్దిన వ్యక్తి నేత్రాలపై ఉన్న మైనాన్ని తొలగించారు. స్వామి, అమ్మవార్ల మొదటి దృష్టి నేరుగా మానవాళిపై పడకుండా ముందుగానే కుంభాకృతిలో ఏర్పాటు చేసిన అన్నపురాశి, అద్దం, మేకలపై పడేలా జాగ్రత్తగా నిర్వహించి కుంభ హారతి ఇచ్చారు.
భక్తులకు ఇబ్బందులు కలుగకూడదు..
దృష్టికుంభం నిర్వహణతో దృష్టి దోషాలు తొలగుతాయని ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్, ఈఓ అద్దంకి నాగేశ్వర్ రావు తెలిపారు. జాతరలో పాల్గొనే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, కీడు కలగకూడదని సమాజ క్షేమం కోసం పూర్వ ఆచారం ప్రకారం.. దృష్టికుంభం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీంతో జాతర ముందు నిర్వహించే ప్రధాన ఘట్టం ముగిసిందని వారు పేర్కొన్నారు. ఎస్సై పస్తం శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ బొల్లెపల్లి మధు, ముఖ్య అర్చకులు పాతర్లపాటి శ్రీనివాస్, ఐనవోలు మధుకర్, వేద పారాయణదారు గట్టు పురుషోత్తమ శర్మ, విక్రాంత్ వినాయక్ జోషి అర్చకులు నందనం భాను ప్రసాద్, ఉప్పుల శ్రీనివాస్, పాతర్లపాటి నరేశ్‌శర్మ, నందనం మధు, దేవేందర్, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment