దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి
ఎంజీఎం: చలి తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని హనుమకొండ డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య సూ చించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లల విషయంలో మరింత శ్రద్ధ వహించాలని ఆయన పేర్కొన్నారు. చల్ల గాలిలో తిరగడం వల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, శ్వాస సంబంధిత సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉందని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వివరించారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. శరీరానికి వేడినిచ్చే దుస్తులు ధరించాలని, గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలని, చిన్న పిల్లలకు స్వెటర్లు, చెవులకు టోపీలు పెట్టి, కాళ్లకు, చేతులకు గ్లౌజులు, సాక్సులు వేయాలని పేర్కొన్నారు. వాకింగ్ వెళ్లే వారు మఫ్లర్లు, స్వెటర్లు, మంకీ క్యాపులను ధరించాలని, ద్విచక్ర వాహనదారులు చలి ఎక్కువగా ఉన్నప్పుడు గ్లౌజు లు, హెల్మెట్, స్వెటర్లు తప్పక ధరించాలని సూచించారు. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే సమీపంలోని పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స తీసుకోవాలన్నారు.
ఆర్టీసీ విద్యుత్
సబ్‌స్టేషన్ ప్రారంభం
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ వరంగల్–2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సుల చార్జింగ్ కోసం నిర్మించిన 33 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ ఖుస్రో షా ఖాన్ మంగళవారం ప్రారంభించారు. ఆర్టీసీ వరంగల్ ఆర్‌ఎం డి.విజయభాను, డిప్యూటీ ఆర్‌ఎంలు కేశరాజు భానుకిరణ్, మాధవరావు, ఈఈ భాస్కర్, డిపో మేనేజర్లు జ్యోత్స్న, వంగాల మోహన్‌రావు, ధరంసింగ్, ఎన్పీడీసీఎల్ హనుమకొండ ఎస్‌ఈ కె.వెంకటరమణ, డీఈ జి.సాంబ రెడ్డి, ఏడీలు మల్లికార్జున్, కిరణ్ పాల్గొన్నారు.
అదనపు డీసీపీ
సంజీవ్‌కు పదోన్నతి
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆర్మ్‌డ్ రిజర్వ్‌డ్ విభాగం అదనపు డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న పి.సంజీవ్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను సైబరాబాద్ కమిషనరేట్ అర్మ్‌డ్ రిజర్వ్‌డ్ విభాగం డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా పదోన్నతి పొందిన డీసీపీ సంజీవ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝాను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. అనంతరం సీపీ అంబర్ కిషోర్ ఝా పదోన్నతి పొందిన డీసీపీ సంజీవ్‌కు అభినందనలు తెలిపారు.
రేపు ఏకసభ్య కమిషన్ రాక
వరంగల్: ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ జస్టిస్ షమీమ్ అక్తర్ వరంగల్ జిల్లా పరిధిలో బహిరంగ విచారణ చేపట్టేందుకు గురువారం రానున్నట్లు వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఒక ప్రకటనలో తెలిపారు. షెడ్యూల్డ్ కులాల ఉప వర్గీకరణపై వివరణాత్మక అధ్యయనం కోసం హనుమకొండ కలెక్టరేట్‌లో బహిరంగ విచారణ ఉంటుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని ఎస్సీ కుల సంఘాల నాయకులు హాజరై ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తమ వినతులను కమిషన్‌కు అందించాలని ఆమె కోరారు.
Comments
Please login to add a commentAdd a comment