చర్చా.. రచ్చా?
వరంగల్ అర్బన్: నగరంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారింది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు అటకెక్కాయి. వివిధ విభాగాల పనితీరు అధ్వానంగా తయారైంది. కార్పొరేటర్లు, అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. సమస్యల పరిష్కారంపై తీవ్ర నిర్లక్ష్యం జరుగుతోంది. కొంత మంది ప్రతిపక్ష, అధికార పక్ష కార్పొరేటర్లు తమ ఉనికిని చాటుకోవడానికి సర్వసభ్య సమావేశంలో హడావిడి చేస్తున్నారే తప్ప వాటి పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయడం లేదు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన కౌన్సిల్ హాల్లో సర్వసభ్య సమావేశం జరగనుంది. 15 అంశాలతో కూడిన అజెండాను సిద్ధం చేశారు. మాస్టర్ ప్లాన్‌లో ఇన్నర్ రింగ్ రోడ్డు ‘ఆలైన్ మెంట్’ మార్పు, అజాంజాహి మిల్లు కార్మికుల యూనియన్ భవనం స్థానంలో ఓ వ్యాపారికి కమర్షియల్ కాంప్లెక్స్‌కు అనుమతివ్వడం తదితర అంశాలపై చర్చకు పట్టుబట్టాలని, కేంద్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో జాప్యం, అధికార పక్షం తీరుపై నిరసన వ్యక్తం చేయాలని బీఆర్‌ఎస్, బీజేపీ నిర్ణయించుకున్నాయి. మరోవైపు అధికార పార్టీలో అసంతృప్తులు బయట పడకుండా ఉండేందుకు ముందస్తుగా చర్చలు జరిగాయి.
నిధులున్నా.. పనులేవి?
ఇటీవల గ్రేటర్ అభివృద్ధికి నిధుల వరద పారింది. ఆనిధులు ఖర్చయ్యే మార్గం కానరాక డివిజన్లలో అభివృద్ధి నిలిచింది. ఇంజినీర్ల నిర్లక్ష్యం అడుగడునా కనిపిస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ మరో మూడు నెలలు గడిస్తే ముగియనుంది. 15వ ఆర్థిక సంఘం, స్వచ్ఛ భారత్ నిధులు సకాలంలో వినియోగించుకోలేకపోతున్నారు.. గత ప్రభుత్వ హయాంలో పట్టణ ప్రగతి నిధులు ఖర్చు చేయలేకపోయారు. వివిధ పథకాల్లో చేపట్టిన 30శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి. చాలా పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. జనరల్ ఫండ్, ఎస్‌సీ తదితర నిధులతో చేపట్టే పనులు అడుగు ముందుకు రెండడుగులు వెనక్కి అన్నట్లుగా మారుతున్నాయి. నగరంలోని అనేక సమస్యలపై ప్రజలు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ పరిష్కారం దొరకడం లేదు ఇవన్నీ చర్చకు రావాల్సి ఉంది.
నేడు గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం
ఎండగట్టేందుకు బీఆర్‌ఎస్,
బీజేపీ సభ్యులు రె‘ఢీ’
ఎదుర్కొనేందుకు సిద్ధమంటున్న అధికార పక్షం
తీర్మానాలకే పరిమితమవుతున్న సర్వసభ్య సమావేశాలు
ప్రజా సమస్యలపై గళం ఎత్తాలి
దాస్యం వినయ్‌భాస్కర్
హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కౌన్సిల్ సమావేశంలో ప్రజా సమస్యలపై గళం ఎత్తాలని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్.. ఆ పార్టీ కార్పొటర్లకు సూచించా రు. ఆదివారం రాత్రి హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో కార్పొరేటర్లతో వారు సమావేశమై కౌన్సిల్‌లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశా రు. కౌన్సిల్ వేదికగా ప్రజల పక్షాన పోరాడాలన్నారు. డివిజన్ల అభివృద్ధికి కావాల్సిన నిధులు కోసం కొట్లాడాలని సూచించారు. నగర ప్రజలకు అవసరమైన సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతున్న తీరును ఎండగట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment