పథకాల లక్ష్యాలు చేరుకోవాలి..
కలెక్టర్ ప్రావీణ్య
హన్మకొండ అర్బన్: జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లక్ష్యాలను 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు వరకు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛభారత్ మిషన్, చేయూత పింఛన్లు, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం లక్ష్యంగా ఉన్న 2,44,600 పని దినాలు కల్పించాలని, 1,420 పనులు ప్రారంభించి పూర్తి చేయాలని సూచించారు. మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాకలు, అజోల్ పిట్ల నిర్మాణం, వర్మీ కంపోస్ట్ పిట్ల నిర్మాణం, కోళ్ల ఫారాలు, ఎస్సీ/ఎస్టీల భూముల అభివృద్ధి చేపట్టాలని ఆదేశించారు. పొలం బాటల ద్వారా 60 కిలోమీటర్ల మేర మొరం రోడ్లు, కల్వ ర్టుల నిర్మాణం చేపట్టాలని, పండ్ల తోటల పెంపకానికి 114 ఎకరాలు కేటాయించాలని పేర్కొన్నారు. జల నిధి పనుల కింద చెక్ డ్యామ్‌లు, ఫార్మ్ పాండ్‌లు, ఊట కుంటలు, నీటి సంరక్షణ పనులు పూర్తి చేయాలని సూచించారు. గ్రామీణ పారిశుద్ధ్యానికి ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. ఎంపీడీఓలు తమ మండలాల్లో నర్సరీలను పర్యవేక్షించి, వందశాతం మొక్కల పెంపకం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. మరణించిన పింఛన్‌దారుల వివరాలు నవీకరించి వారి జీవిత భాగస్వాములకు పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. పెండింగ్ అంశాలు, కొత్త దరఖాస్తులు, ఈ–కేవైసీ క్లియరెన్స్ కార్యక్రమాలను పూర్తి చేయాలని సూచించారు. ఉపాధి హామీ కింద కేటాయించిన రూ.10.35 కోట్లతో పనులు చేపట్టాలని.. ఇవి మార్చి 31, 2025 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
ఎగుమతులు పెంచేందుకు చర్యలు
జిల్లా నుంచి ఎగుమతులు పెంచేందుకు అవసరమైన అన్ని వసతులు అందించేదుకు యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎగుమతులు చేసే ఉత్పత్తుల పరిమాణం, వివరాలను ఆయా అసోసియేషన్ల సహకారంతో సేకరించి, ఉప సంఘాల్లో చర్చించి, నివేదిక రూపంలో సమర్పించాలని సూచించారు. జిల్లా నుంచి బియ్యం, గ్రానైట్, మిరపకాయలు, టెక్స్‌టైల్ ఉత్పత్తులు పెద్ద సంఖ్యలో ఎగుమతి అవుతున్నాయని, రైతులకు అవగాహన కల్పించి నాణ్యమైన ఉత్పత్తికి ప్రోత్సహించాలని, తద్వారా అధిక ఆదాయం సాధించేందుకు వీలు కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ నవీన్‌కుమార్, డీజీఎఫ్‌టీ ఉప సంచాలకులు శైలజ, ఎల్‌డీఎం శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, గ్రానైట్ అసోసియేషన్ అధ్యక్షుడు చక్రధర్‌రెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పథకాల లక్ష్యాలు చేరుకోవాలి..
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం 2024–25 ముగింపు వరకు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో ఉపాధి హామీ పథకం, స్వచ్ఛ భారత్ మిషన్, చేయూత పింఛన్లు, తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment