వరికి వాయు గండం
భీమవరం: వాతావరణం జిల్లా రైతులకు గుబులు పుట్టిస్తోంది. సార్వా వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో నైరుతి బంగాళాఖాతంలో ఈనెల 25న వాయుగుండం ఏర్పడనుందనే వాతావరణ శాఖ ప్రకటన కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై చలిగాలుల తీవ్రత పెరగడంతో తుపాను ముప్పుతప్పేలా లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 2.19 లక్షల ఎకరాల్లో సార్వా వరి నాట్లు వేశారు. సీజన్ ప్రారంభం నుంచి అధిక వర్షాలు, వరదల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. పలు చోట్ల నాట్లు దెబ్బతినడంతో రెండు, మూడుసార్లు తిరిగి నాట్లు వేయగా.. కొందరు పెట్టుబడి పెట్టలేక భూములను బీడులుగా వదిలివేశారు. ముందుగా దెబ్బతిన్న వరి నాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. తుపాను ప్రభావం దక్షిణ కోస్తా తీరంపై ఎక్కువగా ఉండే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలతో కోతకు సిద్ధంగా ఉన్న పంటను గట్టుకు చేర్చడానికి రైతులు శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో సుమారు 45 వేల ఎకరాల్లో మాత్రమే మాసూళ్లు పూర్తిచేయగా ఎక్కువ శాతం కోతకు సిద్ధంగా ఉంది.
ఎండబెట్టడానికీ ఇబ్బందులే.. రైతులు ఎక్కువగా కోత యంత్రాలతో మాసూళ్లు చేపట్టడంతో ధాన్యాన్ని ఎండబెట్టడానికి ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం ఎండబెట్టడానికి కళ్లాలు లేకపోవడంతో రోడ్లు వెంబడి, రియల్‌ఎస్టేట్ భూములను ఉపయోగించుకుంటున్నారు. ఇటువంటి తరుణంలో రెండు రోజులుగా ఎండ తీవ్రత సరిగా లేకపోవడంతో అవస్థలు తప్పడం లేదు. కోత యంత్రాల ద్వారా మాసూళ్లు చేసిన ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ధాన్యం విక్రయానికి ఎండబెట్టడం తప్పనిసరి. అయితే చలిగాలులు, కళ్లాలు లేకపోవడం వంటి సమస్యలతో ఎక్కువ రోజులు ఆరబెట్టాల్సి వస్తుందని, దీంతో ఖర్చు పెరుగుతుందని రైతులు అంటున్నారు. తుపాను ప్రభావంతో అధిక వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
వాతావరణ హెచ్చరికలతో రైతుల ఆందోళన
ముమ్మరంగా ఖరీఫ్ మాసూళ్లు
జిల్లాలో 2.19 లక్షల ఎకరాల్లో సాగు
రైతులు అప్రమత్తంగా ఉండాలి
జిల్లాలో సార్వా వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో బంగాళాఖాతంలో వాయుగుండంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి. మాసూళ్లు చేసిన ధాన్యాన్ని చేలలో ఉంచకుండా గట్టుకు చేర్చుకోవాలి. అలాగే కూలీలతో మాసూళ్లు చేసే రైతులు వాయుగుండం ప్రభావం తగ్గే వరకూ కోతలను వాయిదా వేసుకోవడం మంచిది.
– జెడ్.వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, భీమవరం
Comments
Please login to add a commentAdd a comment