తవ్వేయ్.. తరలించేయ్
పెనుగొండ: నడిపూడి ర్యాంపులో ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ర్యాంపు నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేకపోయినా మూడో రోజు గురువారం కూడా ఇసుక అమ్మకాలు సాగాయి. పగలు ర్యాంపులో మెషీన్లతో ఇసుకను మేటలు వేస్తూ, రాత్రిళ్లు అమ్మకాలు చేస్తున్నారు. అధికారులకు పైస్థాయిలో ఒత్తిళ్లు ఉండటంతో ఇటుగా కన్నెత్తి చూడటం లేదు. మూడు రోజులుగా 600 వాహనాలకు పైగా ఇసుకను విక్రయించినట్టు అంచనా. ఒక్కో యూనిట్ ఇసుకకు రూ.500 లోడింగ్, బాట చార్జీలు వసూలు చేస్తున్నారు. బాహాటంగా ఇసుక అక్రమంగా తవ్వుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు విస్తుపోతున్నారు.
డిమాండ్‌తో భారీగా వాహనాలు
జిల్లాలో ర్యాంపులకు అనుమతి లేకపోవడంతో ఇసుకకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో నడిపూడిలో అక్రమంగా ఇసుక తవ్వడంతో జిల్లా నలుమూలల నుంచి వందలాది వాహనాలు తరలివస్తున్నాయి. సిద్ధాంతం నుంచి నడిపూడి వరకు వాహనాలు బారులు తీరుతున్నాయి. మరోవైపు జాతీయ రహదారి వరకూ నిలిచి ఉంటున్నాయి. ఇదిలా ఉండగా లోడింగ్‌కి తమకు అవకాశం ఇవ్వకపోవడంతో ఇసుక కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడిపూడిలో సుబ్రహ్మణ్యేశ్వర ఇసుక కార్మికుల సంఘంలో 300 మంది కార్మికులు ఉన్నారు. వీరికి ఉపాధి కల్పించడంలో అడ్డుపడుతున్నారంటూ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఇంతలా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా మైనింగ్, జిల్లా అధికారులు కదలకపోవడం విశేషం.
యథేచ్ఛగా ఇసుక అక్రమ తవ్వకాలు
అనుమతులు లేని ర్యాంపులో కార్యకలాపాలు
నడిపూడి ర్యాంపు వైపు కన్నెత్తి చూడని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment