మామిడి మొక్కల నరికివేత
నూజివీడు: గత 30 ఏళ్లుగా మామిడి తోటలు వేసుకొని సాగు చేసుకుంటున్న భూముల్లోని మామిడి మొక్కలను నిర్దాక్షణ్యంగా అటవీశాఖ సిబ్బంది నరికివేయడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూజివీడు మండలం మిట్టగూడెం, హనుమంతులగూడెం గ్రామస్తులు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మండలం అన్నేరావుపేట అటవీ ప్రాంతంలో 30 ఏళ్లుగా మామిడి మొక్కలు నాటుకుని జీవనం సాగిస్తున్నారు. వీటిలో కొన్ని చెట్లు పెద్దగా పెరిగి కాపు సరిగా కాయకపోవడంతో వాటిని నరికివేసి మళ్లీ మామిడి మొక్కలు వేసి పెంచుకుంటున్నారు. ఐదుగురు రైతులు దాదాపు 12ఎకరాల్లో నాటుకున్న మూడేళ్ల వయస్సున్న 200 మామిడి మొక్కలను రెండు రోజుల క్రితం అటవీశాఖ సిబ్బంది నరికివేయడం దారుణమని వాపోతున్నారు. మిట్టగూడెంకు చెందిన వెలివల నాగరాజు రెండు ఎకరాలు, అతని అన్నకు రెండెకరాలుండగా ఈ నాలుగెకరాల్లో మొక్కలు వేసుకొని పెంచుకుంటుంటే అటవీశాఖ అధికారులు నరికివేశారని వాపోయారు. అదే గ్రామానికి చెందిన మట్టా పుల్లయ్య, అతని ఇద్దరు కొడుకులు కలిసి నాలుగు ఎకరాలు సాగు చేసుకుంటూ మామిడి మొక్కలు నాటుకొని పెంచుకుంటుంటే వాటిని నరికేశారు. తమకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని, అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment