విద్యార్థులకు గంట తంటా
భీమవరం: రాష్ట్రంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల పనివేళల పెంపు నిర్ణయాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సర్కారీ విద్యకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక సంస్కరణలు తీసుకురాగా.. కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటీ రద్దు చేస్తూ తాజాగా ఉన్నత పాఠశాలల పనివేళలను మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సీబీఎస్‌ఈ సిలబస్, టోఫెల్ విధానం రద్దు చేసిన ప్రభుత్వం తాజాగా పాఠశాలల పనివేళల మార్పు అంశాన్ని తెరపైకి తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలోని 20 హైస్కూళ్లలో..
ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. టెన్త్ పబ్లిక్ పరీక్షల సమయంతో అదనపు తరగతులు నిర్వహిస్తుంటారు. అయితే నూతనంగా పనివేళలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచారు. దీని కారణంగా ఒక్కో పీరియడ్‌కు 5 నిమిషాల సమయం పెరగడంతోపాటు మధ్యాహ్నం విశాంత్రి సమయంలో 20 నిమిషాలు పెరిగింది. జిల్లాలోని 207 హైస్కూళ్లకు గాను మండలానికి ఒకటి చొప్పున 20 ఉన్నత పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఆయా పాఠశాలల్లో ఈనెల 20వ తేదీ నుంచి 30 వరకు పనివేళల పెంపు అ మలు చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు అదనంగా ప్ర యోజనం లేకపోగా దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థినులు అవస్థలు పడతారనే ఆందోళన వ్యక్తమవుతోంది. కళాశాలలు, పాఠశాలలు ఒకే సమయంలో ముగియడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో మరింత రద్దీ పెరిగి ప్రయాణం భారమవుతుందని పలువురు అంటున్నారు. అలాగే ఎక్కువ సమయం తరగతి గదిలో ఉండటం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిళ్లకు గురవుతాయని ఉపాధ్యా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఉన్నత పాఠశాలల పనివేళల పెంపుతో షాక్
దూరప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇబ్బందులు
మానసిక ఒత్తిళ్లు తప్పవంటున్న ఉపాధ్యాయులు
రాత్రి 7 గంటలవుతోంది
మా స్కూల్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో భీమవరం మండలం పెదగరువు గ్రామం నుంచి వచ్చే విద్యార్థులు తిరిగి బస్సులో ఇంటికి వెళ్లడానికి రాత్రి 7 గంటలు అవుతుంది. పనివేళలు పెంచడం వల్ల ప్రధానంగా విద్యార్థినులకు ఎక్కువ ఇబ్బంది.
–ఎన్.వర్షిణి, విద్యార్థిని, పెదగరువు
భయంగా ఉంది
హైస్కూల్ సమయాలను పెంచడం వల్ల ఒత్తిడి ఎక్కువై అనారోగ్యం పాలయ్యే ప్రమాదముంది. ఉదయం 9 గంటలకు తరగతులకు హాజరుకావాలంటే ఇంటి వద్ద 7.30 గంటలకు బయలు దేరాలి. సాయంత్రం 5 గంటల వరకూ తరగతిలో ఉంటే ఒత్తిడి మరింత పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుందని భయంగా ఉంది.
– కె.రోజలిన్, విద్యార్థిని,యమునాపల్లి
బస్సులో ప్రయాణం నరకమే
నేను రోజూ యమునాపల్లి గ్రామం నుంచి ఆర్టీసీ బస్సులో భీమవరం స్కూల్‌కు వస్తుంటాను. పాఠశాల సమయం పెంచడం వల్ల సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో కళాశాల విద్యార్థులు కూడా అదే సమయంలో రావడంతో బస్సు ఎక్కడం కష్టమైపోతుంది. 4 గంటలకు స్కూల్ అయిపోతే బస్సుల్లో రద్దీ తక్కువగా ఉంటుంది.
– బి.బెస్లీ, ఆరో తరగతి, యమునాపల్లి, భీమవరం మండలం
గ్రామీణ విద్యార్థులకు అవస్థలు
పాఠశాలల పనివేళల పెంపు వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఇబ్బందులు ఎక్కువవుతాయి. దూర ప్రాంతాల నుంచి సైకిళ్లపై వచ్చే విద్యార్థినులకు భద్రత కొరవడుతుంది. ఒక్కో పీరియడ్‌కు కేవలం 5 నిమిషాల సమయం పెంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. పనివేళల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలి.
–ఎల్.సాయిశ్రీనివాస్, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు
మానసిక ఒత్తిడికి గురవుతారు
పాఠశాలల పనివేళలు పెంచడం వల్ల విద్యార్థులు ఎక్కువ సమయంతరగతి గదిలో ఉంటూ మానసిక ఒత్తిడికి గురవుతారు. విశాంత్రి సమయం పెంచడం వల్ల అప్పుడు విద్యార్థులను కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు రాత్రి సమయంలో ప్రయాణించడం ఇబ్బందికరమే.
– జి.ప్రకాశం, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment