రెవెన్యూ అధికారుల సర్వే
కొయ్యలగూడెం: కన్నాపురంలో చెట్ల నరికివేతపై రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. 28న సాక్షిలో ప్రచురితమైన ‘చెట్లు నరకవద్దంటూ గ్రామస్తుల ఆందోళన’ శీర్షికకు స్పందించిన ఉన్నతాధికారులు సమగ్ర సర్వే చేపట్టాల్సిందిగా రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో వీఆర్‌వో, రెవెన్యూ సిబ్బంది యర్రాయిగూడెం రోడ్డులో నరికి వేతకు గురైన చెట్లను పరిశీలించి భూఆక్రమణలకు సంబంధించిన అంశంపై గ్రామస్తుల ఆరోపణ మేరకు సర్వే చేశారు. ఈ నేపథ్యంలో ఆక్రమణదారులు పుంత రోడ్డును ఆక్రమించారని అదేవిధంగా స్మశాన వాటికకు వెళ్లే దారిని కూడా ఆక్రమించారంటూ అధికారుల వద్ద ఫిర్యాదు చేశారు. పూర్తి సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని వీఆర్‌వో సుబ్బారావు పేర్కొన్నారు.
దివ్యాంగుల పింఛన్ల
ఏరివేతకు కుట్ర
అత్తిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పింఛన్ల వెరిఫికేషన్ పేరుతో అనేక సాకులు చూపించి ఏరివేసేందుకు కుట్ర చేస్తుందని వైఎస్సార్‌సీపీ దివ్యాంగ విభాగం జిల్లా అధ్యక్షుడు బుడితి సుజన్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. సందప సృష్టిలో భాగంగా దివ్యాంగుల కడుపు కొట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేయడం సిగ్గుచేటన్నారు. జనవరి నుంచి మే వరకు పింఛన్ లబ్ధిదారుల వెరిఫికేషన్ నెపంతో సదరం సర్టిఫికెట్లు జారీ నిలుపుదల చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించడం దారుణమన్నారు. సదరం సర్టిఫికెట్ జారీ నిలుపుదల వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు పడతారని, ఐదు నెలలు పాటు జారీ నిలుపుదల చేశారని, ఈ నేపథ్యంలో పింఛన్ల మంజూరు ఎప్పటికి చేస్తారోనని దివ్యాంగులు ఆందోళనకు గురవుతున్నారని సుజన్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో బూటకపు హామీలు, తప్పుడు ప్రచారాలు చేసి ఓట్లు వేయించుకుని అధికారం చేపట్టి ఇప్పుడు ప్రజల్ని దారుణంగా మోసం చేయడమే గాక అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఇప్పటికే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని, ఫీజులు చెల్లించకుండా విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారంలో నెట్టిందని సుజన్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేసారు.
పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తల్ని అన్ని విధాలా ప్రోత్సహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన 16వ జిల్లా పరిశ్రమలు, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను అన్ని రకాలుగా ప్రోత్సహించాలని ఆదేశించారు. సింగిల్ విండో పోర్టల్‌లో సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 26 వరకు పారిశ్రామికవేత్తల నుంచి 129 దరఖాస్తులకు స్వీకరించగా, వాటిలో 126 దరఖాస్తులు ఆమోదించామన్నారు. పీఎంఈజీపి పథకంలో రుణాల మంజూరుకు 2024–25 ఆర్థిక సంవత్సరానికి 211 దరఖాస్తులను స్వీకరించామని, వంద దరఖాస్తులను ఆమోదించగా 53 ఇప్పటికే గ్రౌండింగ్ అయ్యాయని చెప్పారు. లబ్ధిదారులు దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలన్నారు. పరిశ్రమలలో ప్రమాదాల నివారణకు పారిశ్రామికవేత్తలతో వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలని సేఫ్టీ కమిటీ అధికారులను ఆదేశించారు.
పోలీస్ కానిస్టేబుల్ ఎంపికలు ప్రారంభం
ఏలూరు టౌన్: పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు సంబంధించి తుది ఎంపికలకు రంగం సిద్ధం చేశారు. గతంలో ఎంపికల్లో ప్రాథమిక రాత పరీక్షలు పూర్తి చేయగా... తాజాగా దేహదారుఢ్య పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఏర్పాట్లను శనివారం రాత్రి పర్యవేక్షించారు. ఈ నెల 30 నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దేహదారుఢ్య పరీక్షలు జనవరి 9 వరకూ కొనసాగుతాయని ఎస్పీ తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరిలో 4,976 మంది అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు మంజూరు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment