కొల్లేరులో మళ్లీ రాజుకున్న వివాదం
భీమడోలు: కొల్లేరు గ్రామం చెట్టున్నపాడులో ఆక్వా చెరువుల లీజు వివాదం మరోసారి రాజుకుంది. దేవస్థానానికి చెందిన ఆక్వా చెరువు లీజు రద్దు చేయాలని, చెరువు నుంచి కూటమి నేతకి చెందిన గేదెలు, గడ్డివాములను తక్షణమే ఖాళీ చేయించాలని, గ్రామస్తుల సమక్షంలో మరోసారి వేలం పాట నిర్వహించాలన్న ప్రధాన డిమాండ్లతో శనివారం రాత్రి గ్రామానికి వచ్చిన సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్‌లు వెళ్తున్న జీపును రోడ్డుపై అడ్డుకుని బాధిత వర్గం ఆందోళకు దిగింది. అనంతరం ఆక్వా చెరువు వద్దకు వెళ్లి ఆందోళన చేస్తూ.. రాత్రంతా అక్కడే జాగరణ చేశారు. దీంతో ఆదివారం గ్రామంలోకి అధిక సంఖ్యలో పోలీసులు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం ఆందోళన చేయగా చెరువులను ఖాళీ చేయిస్తామని పోలీసులు హామీ ఇచ్చారని, అయితే ఇప్పటికీ అమలు కాలేదంటూ బాధిత వర్గంలోని దేవదాసు శ్రీనివాసరావు, దేవదాసు రాజ్‌కుమార్, బొంతు జయమణిలతో పాటు పలువురు గ్రామస్తులు పోలీసులను ప్రశ్నించారు. ఉదయం చెరువు వద్ద టెంటు వేసుకుని ఆందోళన కొనసాగించారు. దీంతో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై వై.సుధాకర్ బాధిత వర్గంలోని పెద్దలతో చర్చించారు. చెరువు వద్ద ఉన్న పొక్లెయిన్‌ను 15 రోజుల క్రితమే పంపించి వేశామని, చెరువు వద్ద గేదెలను పంపుతున్నామని, గడ్డివాములను రెండు రోజుల్లో ఖాళీ చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో బాధితులు ఆందోళన విరమించారు.
ఆదివారం ఉదయం చెరువు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న దృశ్యం
ఆక్వా చెరువుల లీజుపై ఆందోళన
చెట్టున్నపాడులో రాత్రంతా జాగరణ
పోలీసుల హామీతో ఆందోళన విరమణ
Comments
Please login to add a commentAdd a comment