గడువులోపు అర్జీలు పరిష్కరించాలి
భీమవరం: ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ అర్జీలు పునరావృతం కాకుండా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం భీమవరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించారు. బాధితుల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, అత్తింటి వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్‌లైన్ మోసం, ప్రేమ పేరుతో వంచన, ఆస్తి తగాదాలకు సంబంధించి ఎనిమిది అర్జీలను ఎస్పీ స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వి.భీమారావు, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ వి.పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.
యోగాలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ
నూజివీడు: భువనేశ్వర్‌లోని కిట్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన జాతీయ స్థాయి అంతర్ విశ్వవిద్యాలయాల యోగాసన పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ కనబరిచాడు. రిథమిక్ యోగాలో ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థి టి.దుర్గాప్రసాద్ తృతీయస్థానం సాధించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. విద్యార్థిని డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ బి.లక్ష్మణరావు తదితరులు అభినందించారు.
ఐఆర్‌సీటీసీ మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర
ఏలూరు (టూటౌన్): ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో జనవరి 19 నుంచి మహా కుంభ పుణ్యక్షేత్ర యాత్ర ప్రారంభించనున్నట్టు రైల్వే విజయవాడ ఏరియా మేనేజర్ ఎం.రాజా ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్‌లో జనవరి 19న రైలు బయలుదేరి విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. యాత్రలో భాగంగా వారణాశి, అయోధ్య, హనుమాన్ గర్హి, ఆరతి, ప్రయాగ్ రాజ్ వంటి క్షేత్రాలు సందర్శించవచ్చన్నారు. యాత్ర ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లు ఉంటుందని తెలిపారు. స్లీపర్ క్లాస్‌లో పెద్దలకు రూ.22,635, పిల్లలకు రూ.21,740 స్టాండర్ట్ క్లాస్ టికెట్ ధర పెద్దలకు రూ.31,145, పిల్లలకు రూ.30,095, కంఫర్ట్ క్లాస్ టికెట్ ధర పెద్దలకు రూ.38,195, పిల్లలకు రూ.36,935గా నిర్ణయించామని తెలి పారు. మరిన్ని వివరాలకు సెల్ 92814 95848, 8977314121 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ముగిసిన సర్టిఫికెట్ల పరిశీలన
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థతో పాటు ఏడు మున్సిపాలిటీల్లో 2017లో క్వాలిఫై అయిన తెలుగు, హిందీ స్పెషల్ గ్రేడ్ టీచర్లకు పదోన్నతుల నిమిత్తం అర్హులైన వారి సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం ముగిసింది. అర్హులైన ఎస్‌జీటీల జాబితాను ఇటీవల డీఈఓ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఏలూరు నగరపాలక సంస్థ యూనిట్‌గా తెలుగు ఎస్‌జీటీలు 16 మంది, మిగిలిన ఏడు మున్సిపాలిటీల్లోని 29 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అలాగే హిందీ ఎస్‌జీటీల్లో ఏలూరు నగరపాలక సంస్థ యూనిట్ నుంచి ఆరుగురు, మిగిలిన ఏడు మున్సిపాలిటీల నుంచి తొమ్మిది మంది హాజరయ్యారు.
42,602 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు
ఏలూరు (మెట్రో): తూర్పు, పశ్చిమ, కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని గ్రాడ్యుయేట్ ఓటర్ల తుది జాబితాను సోమవారం అధికారులు విడుదల చేశారు. ఏలూరు జిల్లాలోని 62 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఓటర్ల జాబితాను ప్రకటించారు. జిల్లాలో 24,895 పురుష, 17,699 మహిళా గ్రాడ్యుయేట్లు ఉన్నారు. ఇతరులు ఎనిమిది మంది ఉండగా మొత్తంగా 42,602 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment