దేహదారుఢ్య పరీక్షలకు 459 మంది హాజరు
ఏలూరు టౌన్: ఏపీ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చేపట్టిన కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియ కొనసాగుతుంది. ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం దేహదారుఢ్య పరీక్షలకు అభ్యర్థులు హాజరయ్యారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 600 మంది పురుష అభ్యర్థులకు హాల్ టిక్కెట్లు జారీ చేశారు. ఎంపిక పోటీలకు 459 మంది హాజరుకాగా.. వారిలో 313 మంది ఎంపికైనట్లు ఎస్పీ శివకిషోర్ చెప్పారు. అభ్యర్థులు ఎంపిక పోటీలకు హాజరయ్యే సమయంలో తమ ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో రావాలని ఆయన తెలిపారు.
నిరంతర అధ్యయనంతోనే సివిల్స్‌లో విజయం
భీమవరం: సామాజిక ఆర్థిక పరిస్థితులపై నిరంతరం అధ్యయనం, అవగాహనతోనే సివిల్స్‌లో విజయం సాధించగలరని జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డి అన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజనీరింగ్ కళాశాల ఉమెన్ ఎంపవవర్‌మెంట్ సెల్, ఎన్‌ఎస్‌ఎస్ సంయుక్తంగా బుధవారం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ప్రిపరేషన్ గైడ్ అంశంపై రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడారు. ప్రతి విద్యార్థి తన లక్ష్యసాధనలో సబ్జెక్టుతో పాటు సామాజిక, ఆర్థిక అంశాలు దేశ సాంకేతిక ప్రగతి, మారుతున్న టెక్నాలజీలు, వాతావరణ పరిస్థితులు, జీవన విధానం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవాలన్నారు. నిత్యం దినపత్రికల్లో వస్తున్న అంశాలను అధ్యయనం చేయాలన్నారు. కేవలం సివిల్స్ ప్రిపరేషన్‌కు మాత్రమే గాకుండా ఏ పోటీ పరీక్షకు హాజరు కావాలన్నా నిరంతరం నూతన అంశాలు తెలుసుకోవాలని సూచించారు. అనంతరం రాహుల్‌కుమార్‌రెడ్డిని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్‌వర్మ సత్కరించారు.
రోడ్ల మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో ఆర్‌అండ్‌బీ రహదారుల పనులు త్వరితగతిన పూర్తిచేయాలని జెడ్పీ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ చెప్పారు. బుధవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా స్థాయి సంఘం సమావేశం జరిగింది. ఆర్‌అండ్‌బీ రహదారుల పురోగతి, ఆర్‌డబ్ల్యూఎస్ స్కీం కింద అమలు చేస్తున్న మంచినీటి పథకాల ఏర్పాటు, ఇరిగేషన్‌కు సంబంధించి కాల్వలకు నీటి విడుదల వంటి అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఎమ్మెల్సీ గోపిమూర్తి, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాసరావు, బడేటి రాధాకృష్ణయ్య (చంటి), పత్సమట్ల ధర్మరాజు, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.
4,560 అర్జీల స్వీకరణ
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో 27 రోజుల పాటు 318 గ్రామాల్లో రెవెన్యూ సదస్సుల ద్వారా 4,560 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ నాగరాణి తెలిపారు. 1,229 అర్జీలు పరిష్కరించగా, 3,331 పరిష్కరించాల్సి ఉందన్నారు. అర్జీల పరిష్కారానికి ప్రభుత్వం 45 రోజులు గడువు విధించిందని, నిర్ణీత సమయంలోగా నూరు శాతం అర్జీలను పరిష్కరిస్తారన్నారు. పరిష్కారం కాని అర్జీలు ఎందుకు కాలేదో సంబంధిత వ్యక్తులకు లిఖిత పూర్వకంగా తెలియజేస్తారన్నారు.
సూర్య ఘర్ యోజనపై అవగాహన కల్పించాలి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన విస్తృత ప్రయోజనాలను ప్రజలకు తెలియజేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో విద్యుత్, నెడ్‌క్యాప్ అధికారులతో సమావేశమై జిల్లాలో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన అమలుపై సమీక్షించారు. సూర్య ఘర్ యోజన పథకం అమలు మందకొడిగా సాగడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇంతవరకు కేవలం 750 రూప్‌టాప్‌లు ఏర్పాటు చేయడంపై ప్రశ్నించారు. సుమారు 50 వేల కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment