కార్పొరేషన్ల ద్వారా విరివిగా రుణాలు
భీమవరం(ప్రకాశంచౌక్): ఎస్సీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా జిల్లాకు రుణాలు మంజూరయ్యాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ద్వారా వివిధ వర్గాలకు మంజూరు చేసే రుణాలపై అధికారులు, బ్యాంకర్లుతో సమావేశమై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ వర్గాలకు 714 యూనిట్లకు రూ.22.38 కోట్ల సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తామన్నారు. సెర్ప్ ద్వారా 120 ఆటోలను మంజూరు చేస్తామన్నారు. బీసీ వర్గాల స్వయం ఉపాధి పథకాలకు 1,901 మందికి రూ.36.49 కోట్లు, ఇతర వర్గాలకు స్వయం ఉపాధి పథకాల కింద 215 మందికి రూ.3.73 కోట్లు మంజూర చేస్తామన్నారు. కాపు కార్పొరేషన్ ఎంఎస్‌ఎమ్‌ఈ పథకంలో 694 యూనిట్లను నెలకొల్పేందుకు రూ.13.88 కోట్లు రుణాలు మంజూరు చేస్తా మన్నారు. జనవరి 26, 27 తేదీల్లో దరఖాస్తులు తిరస్కరణలు ఉంటే తెలియజేస్తారని, లక్ష్యానికి అనుగుణంగా అవకాశం ఉంటే కొత్తవారిని చేర్చుతారన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి.విజయ ప్రకాష్, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పుష్పలత, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ ఏ.నాగేంద్రప్రసాద్, డీఆర్‌డీఏ పీడీ వేణుగోపాల్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతి రావు తదితరులు పాల్గొన్నారు.
జల సంరక్షణ ప్రాజెక్ట్‌పై సమీక్ష : జిల్లాలో జలశక్తి అభియాన్ కింద చేపట్టిన జల సంరక్షణ ప్రాజెక్ట్ పనుల పురోగతి సంతృప్తికరంగా ఉందని కలెక్టర్‌ను జల శక్తి అభియాన్ సెంట్రల్ నోడల్ అధికారి డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. సెంట్రల్ టీం జిల్లాలో మూడు రోజుల పర్యటన అనంతరం బుధవారం క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ మాట్లాడుతూ జనవరి 6 నుంచి 8 వరకు ఆకివీడు మండలం చిన్న కాపవరం, పెద్ద కాపవరం, పెనుమంట్ర మండలం పొలమూరు, ఆచంట మండలం భీమలాపురం, నరసాపురం మండలం నరసాపురం, మొగల్తూరు మండలం మొగల్తూరులో పర్యటించి జల శక్తి అభియాన్ పథకంలో భాగంగా చేపట్టిన పనులు పరిశీలించామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment