సీఎం రేవంత్‌ను కలిసిన ప్రభుత్వ విప్
యాదగిరిగుట్ట: సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ నెల 8న యాదాద్రి ఆలయ పర్యటన నేపథ్యంలో పలు విషయాలను చర్చించినట్లు విప్ ఐలయ్య తెలిపారు. ఆలేరు నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాదగిరి గౌడ్ ఉన్నారు.
తై బజార్ వేలం వాయిదా
భువనగిరిటౌన్: భువనగిరి మున్సిపాలిటీ తై బజార్ వేలం పాట మరో సారి వాయిదా వేశారు. గత నెల 28న వేలం నిర్వహించగా సర్కారు వారి పాట రూ. 3లక్షలు చెప్పారు. ముగ్గురు దరఖాస్తు చేసుకోగా ఎవరూ వేలం పాటలో పాల్గొనలేదు. దీంతో మరోసారి వేలం పాట కోసం దరఖాస్తులు కోరుతూ ప్రకటన విడుదల చేశారు. అయినా ఒక్కరు కూడా వేలం పాట కోసం దరఖాస్తు చేసుకోలేదు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు నిర్వహించాల్సిన వేలంను రద్దు చేస్తున్నట్లు మున్సిపాలిటీ అధికారులు ప్రకటించారు. మరోసారి తేదీలను ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
న్యాయ సహాయానికి
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
భువనగిరి రూరల్: న్యాయ సహాయం కోసం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో టోల్ ఫ్రీ నంబర్ 15100 ఏర్పాటు చేసినట్లు న్యాయ సేవాధికార సంస్థ భువనగిరి కార్యదర్శి మాధవీలత మంగళవారం తెలిపారు. అవసరమైన వారు న్యాయ సహాయం, సలహాల కోసం చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ జయపాల్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.
కొనసాగుతున్న
జిల్లా స్థాయి పోటీలు
భువనగిరి: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో రెండో రోజు మంగళవారం 68వ ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి బాలికల వాలీబాల్ పోటీలు కొనసాగాయి. మొత్తం 12 జట్లు పాల్గొనగా.. మొదటి స్థానంలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ ఆలేరు, ద్వితీయ స్థానంలో ఎంజేపీటీటీబీసీ డబ్ల్యూఆర్‌జేసీ వలిగొండ, తృతీయ స్థానంలో టీజీఎంఎస్ తుర్కపల్లి జట్లు నిలిచాయి. విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి ధనుంజనేయులు, కళాశాల ప్రిన్సిపాల్ పాపిరెడ్డి, ఫిజికల్ డైరెక్టర్లు రమేష్‌రెడ్డి, ఐలయ్య, పాండురంగం, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ పాల్గొన్నారు.
ఆవిర్భావ సభను
విజయవంతం చేయాలి
అడ్డగూడూరు: నల్లగొండ జిల్లా కేంద్రంలో వచ్చే నెల 30న నిర్వహించే సీపీఐ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. మంగళవారం అడ్డగూడూరు మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సహాయ కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు చేడే చంద్రయ్య, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతికుమార్, మండల కార్యదర్శి చేడే భిక్షం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి జిట్టా రాములు, రవీందర్, శ్రీకాంత్, సుదర్శన్‌రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment