రేషన్ బియ్యం తరలిస్తున్న ముఠా అరెస్ట్
మిర్యాలగూడ అర్బన్: అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్న అంతర్ రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం మిర్యాలగూడ డీఎస్పీ కె. రాజశేఖరరాజు విలేకరులకు వెల్లడించారు. అక్టోబర్ 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన కొంతమంది అమాయక కూలీలను వాహనంలో తీసుకొచ్చి దామరచర్ల మండలంలోని బాండావత్ తండాలో రేషన్ బియ్యం బస్తాలను లోడు చేసి తిరిగి వెళ్తుండగా.. దామరచర్ల శివారులో నర్సాపురం ఎక్స్ రోడ్డు వద్ద అర్ధరాత్రి వాహనం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొందరు కూలీలకు తీవ్ర గాయాలు కాగా.. షేక్ నాగులు అనే కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో అప్రమత్తమైన అక్రమ దందాగాళ్లు గుట్టుచప్పుడు కాకుండా గాయపడిన కూలీలను అక్కడి నుంచి ఆంధ్రాకు తరలించారు. షేక్ నాగులు మృతదేహాన్ని కూడా అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి.. బియ్యం బస్తాలను మాయం చేశారు. మరుసటిరోజు ఘటన జరిగిన ప్రదేశంలో రక్తం మరకలు ఉండటం.. రేషన్ బియ్యం పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి.. ప్రమాదానికి గురైన వాహనాన్ని గుర్తించారు. వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. నిందితుల గురించి తెలిసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న పల్నాడు జిల్లా దాచేపల్లి గ్రామానికి చెందిన మందపాటి నరసింహరావు, కల్లూరి లింగయ్యను మంగళవారం పోలీసులు గుర్తించి మిర్యాలగూడలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. అరెస్టయిన వారిపై గతంలో ఎనిమిది కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
అడవిదేవులపల్లిలో ఒకరు అరెస్ట్..
అదేవిధంగా అడవిదేవులపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రేషన్ బియ్యం సేకరించి ఆంధ్రాకు తరలిస్తున్న పల్నాడు జిల్లా రెంటచింతల మండలానికి చెందిన తిప్పబత్తుల వెంకటనారాయణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రాజశేఖరరాజు తెలిపారు. ఆంధ్రాకు చెందిన ఆంగోతు రాంబాబు, పెంటబోయిన సైదారావుతో కలిసి వెంకటనారాయణ రేషన్ బియ్యం దందా చేస్తున్నట్లు తెలిపారు. అతడి నుంచి 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, అడవిదేవులపల్లి ఎస్‌ఐ శేఖర్ తదితరులున్నారు.
ఫ వివరాలు వెల్లడించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖరరాజు
Comments
Please login to add a commentAdd a comment