బోరు మోటార్లు, కరెంట్ వైర్లు చోరీ
భూదాన్‌పోచంపల్లి: మండలంలోని పిలాయిపల్లి గ్రామంలోని తాళ్లచెరువు ఆయకట్టు కింద ఉన్న పలువురి రైతుల వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, కరెంట్ వైర్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. బాధిత రైతులు మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. వరికోతలు పూర్తవ్వడంతో నెల రోజులుగా రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లలేదు. తిరిగి దున్నకాలు ప్రారంభం కావడంతో మంగళవారం రైతులు తమ వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి చూడగా బోరు మోటార్లు, కరెంట్ వైర్లు చోరీకి గురైనట్లు గుర్తించారు. పెద్దగూడేనికి చెందిన కన్నెమోని దానయ్యకు చెందిన 2 బోరు మోటార్లతో పాటు పిలాయిపల్లి గ్రామానికి చెందిన గ్యార నర్సింహ, గ్యార బాలయ్య, మాడ్గుల గోవర్ధన్‌రెడ్డి, పాండాల రాములుకు చెందిన మొత్తం 6 మోటార్లను దుండగులు ఎత్తుకెళ్లారు. అంతేకాక సుమారు 50 మోటార్లకు సంబంధించిన వైరును సైతం దొంగిలించారు. చోరీకి గురైన మోటార్లు, వైర్ల విలువ సుమారు రూ.2.80 లక్షల వరకు ఉంటుందని బాధిత రైతులు పేర్కొన్నారు. వారం క్రితం కూడా పిలాయిపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులకు చెందిన బోరు మోటార్లు చోరీకి గురైనట్లు తెలిసింది. మంగళవారం పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం గ్రామ పరిధిలో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment